స్టాండింగ్‌ కమిటీకి మెడికల్‌ బిల్లు

3 Jan, 2018 02:17 IST|Sakshi
భువనేశ్వర్‌లో వైద్య విద్యార్థుల నిరసన

బడ్జెట్‌ సమావేశాలనాటికే కమిటీ నివేదిక

సమ్మెను విరమించుకున్న ఐఎంఏ

న్యూఢిల్లీ: దేశంలోని వైద్య విద్య ప్రక్షాళనతో పాటు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)ని మార్చేందుకు ఉద్దేశించిన వివాదాస్పద నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపారు. బడ్జెట్‌ సమావేశాలకు ముందు నివేదిక సమర్పించాలని కమిటీని లోక్‌సభ కోరింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగడంతో పాటు, మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై లోక్‌సభలో మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ ప్రకటన చేస్తూ.. ప్రతిపక్షంతో పాటు అధికార ఎన్డీఏ కూడా బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపాలని కోరిందని అందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలకు ముందే నివేదికను సమర్పించాలని కమిటీని కోరాలని స్పీకర్‌ మహాజన్‌ను మంత్రి కోరారు. తర్వాత స్పీకర్‌ లోక్‌సభలో ప్రకటన చేస్తూ.. బడ్జెట్‌ సమావేశాలకు ముందు లోక్‌సభకు నివేదిక సమర్పించాలని స్టాండింగ్‌ కమిటీని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్టాండింగ్‌ కమిటీ నివేదిక నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లు వైద్య వృత్తికి ఉపయోగకరమని కేంద్రం ప్రకటించింది.   

బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఐఎంఏ
ఈ బిల్లును ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారులకు, వైద్య విద్యతో సంబంధంలేని యంత్రాంగానికి తమను జవాబుదారీగా ఉంచడమంటే వైద్య వృత్తిని నిర్వీర్యం చేయడమేనని వారు ఆరోపిస్తున్నారు. మంగళవారాన్ని బ్లాక్‌ డేగా ప్రకటిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. సమ్మె నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. అయితే లోక్‌సభలో బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపడంతో ఐఎంఏ సమ్మెను విరమించుకుంది.   

రాజ్యసభ ‘ప్రశ్నల’ రికార్డు
ప్రశ్నోత్తరాల సమయంలో జాబితాలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా రాజ్యసభ మంగళవారం రికార్డు సృష్టించింది. ప్రశ్నలడిగిన 20 మంది సభ్యుల్లో మంగళవారం 10 మంది గైర్హాజరు కావడంతో ఇది సాధ్యమైంది. ఆ తర్వాత మిగతా సభ్యులు అప్పటికప్పుడు ప్రశ్నలడిగేందుకు సభాధ్యక్షుడు వెంకయ్య అనుమతించారు. జీరో అవర్‌లో గరిష్టంగా18 మంది పలు ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశాలపై మాట్లాడారు.

‘దివాలా’ బిల్లుకు ఓకే               
దివాలా చట్టం సవరణ బిల్లుపార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ది ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌(సవరణ) ఆర్డినెన్స్‌ పేరిట తెచ్చిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో గట్టెక్కింది.అవసరాలకు తగినట్లు బిల్లులో మార్పులు చేస్తామని జైట్లీ సభకు హామీ ఇచ్చారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టపరచి రాజకీయాలకు అతీతంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.  ప్రభుత్వం ఎవరి రుణాలనూ రద్దుచేయలేదన్నారు. అన్ని వస్తువులకు ఒకే జీఎస్టీ రేటు వర్తింపజేయడం సాధ్యం కాదన్నారు. మొత్తం జనాభా దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న దేశాల్లోనే ఏకరేటు పన్ను విధానం అమల్లో ఉందని, భారత్‌లో అది సాధ్యం కాదనిచెప్పారు. యూరియా వాడకాన్ని తగ్గించడానికి ఒక సంచి పరిమాణాన్ని  45 కిలోలకు తగ్గించినట్లు ఎరువుల శాఖ సహాయ మంత్రి లోక్‌సభలో చెప్పారు.

>
మరిన్ని వార్తలు