ఇంతకూ ఎన్‌ఆర్‌సీకి చట్టబద్ధత ఉందా !?

27 Jan, 2020 14:58 IST|Sakshi

ఎన్‌ఆర్‌సీపై అపోహలు, అపార్థాలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేటికీ ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌–జాతీయ పౌరుల పట్టిక)కి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఆర్‌సీ పట్ల ప్రజలు అపోహలు పెట్టుకొని అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎన్‌ఆర్‌సీ అంటే ఏమిటో, అది ఎందుకో అటు ఆందోళనలు చేస్తున్న ప్రజలకుగానీ, వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ పెద్దలకుగానీ సరైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. 

మోదీ ప్రభుత్వ హయాంలో ఎన్‌ఆర్‌సీగా వ్యవహరిస్తున్న జాతీయ జనాభా లెక్కలను గతంలో ఎన్‌పీఆర్‌ (నేషనల్‌ పాపులేషనల్‌ ఆఫ్‌ రిజిస్టర్‌–జాతీయ జనాభా పట్టిక) అని వ్యవహరించేవారు. దేశ జనాభాను లెక్కించడంతోపాటు దేశంలోని పలు సామాజిక వర్గాల అభ్యున్నతిని అంచనా వేసేందుకు పదేళ్లకోసారి ఈ జనగణను నిర్వహిస్తారు. క్రితం సారి 2011లో నిర్వహించిన జన గణనకు 2010లోనే కసరత్తు ప్రారంభం కాగా, 2021లో నిర్వహించేందుకు 2019, డిసెంబర్‌లోనే మోదీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. 

ఎన్‌ఆర్‌సీకి ఎన్‌పీఆర్‌కి తేడా ఏమిటీ?
ఎన్‌పీఆర్‌లోలేని ఎనిమిది కొత్త అంశాలను ఎన్‌ఆర్‌సీలో చేర్చారు. అందులో ఒకటి తల్లిదండ్రులు పుట్టిన స్థలం, పుట్టిన తేదీ–సంవత్సరం, ఆధార్‌ నెంబర్, పాస్‌పోర్ట్‌ నెంబర్, మొబైల్‌ నెంబర్, ఓటరు ఐడీ కార్డు నెంబర్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబర్, పౌరుడి మాతృ భాష. ఓ మతాన్ని లక్ష్యంగా పెట్టుకొనే ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారని, రేషన్‌ కార్డుకు లింకైన ఆధార్‌ కార్డు బయోమెట్రిక్‌ డేటాను ఉపయోగించి ముందుగా ఓ మతస్తులకు రేషన్‌ రద్దు చేస్తారని, ఆ తర్వాత శాశ్వతంగా వారిని దేశం నుంచి బహిష్కరిస్తారన్నది ఆందోళనకారుల వాదన.

పరస్పర విరుద్ధ ప్రకటనలు
ఎన్‌ఆర్‌సీకి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటం కూడా ఓ వర్గం ప్రజల ఆందోళనలను పెంచింది. ‘ఆధార్‌ నెంబర్‌ చెప్పడం, చెప్పక పోవడం పౌరుడి చిత్తం (ఐచ్ఛికం)’ అని డిసెంబర్‌ 24వ తేదీన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఎన్‌ఆర్‌సీలోని అన్ని అంశాలు స్వచ్ఛందంగా వెల్లడించాల్సినవేనని అదే రోజు హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఇక ‘ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబర్‌ వెల్లడించడం తప్పనిసరని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు జనవరి 16వ తేదీన మీడియాకు స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు పుట్టిన స్థలం వెల్లడించడం పౌరుడి ఐచ్ఛికమంటూ జనవరి17వ తేదీన అదే శాఖకు చెందిన మరో అధికారి పేర్కొన్నారు. అవును, అది నిజమేనంటూ జనవరి 22వ తేదీన కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ ప్రకటించారు. ఒక్క ఆధార్‌ నెంబర్‌ మినహా మిగతా అన్ని వివరాలను వెల్లడించడం పౌరులకే శ్రేయస్కరమన్న విషయాన్ని ఎన్యూమరేటర్లు వారితో ఒప్పించాలంటూ ‘ఎన్‌ఆర్‌సీ ట్రైనింగ్‌ మాన్యువల్‌’ తెలియజేస్తోంది. ప్రభుత్వంలోనే ఇంత గందరగోళం ఉందంటే ఇంక ప్రజల్లో ఎంత గందరగోళం ఉంటుంది? 

అసలు చట్టబద్ధతే లేదు
అసలు ఎన్‌ఆర్‌సీలో కొత్తగా చేర్చిన ఎనిమిది అంశాలకు సంబంధించి ఎలాంటి చట్టబద్ధత ఇప్పటి వరకు లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎన్‌పీఆర్‌కు సంబంధించి 2003లో అప్పటి అటల్‌ బిహారి వాజపేయ్‌ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘పౌరసత్వ నిబంధనలు’ తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల సంఖ్య, పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం ప్రతిపౌరుడి బాధ్యతని, తప్పుడు వివరాలను వెల్లడించినట్లయితే అందుకు కుటుంబం పెద్ద బాధ్యత వహించాల్సి ఉంటుందని, దానికి జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆ చట్టం తెలియజేస్తోంది. ఐచ్చికం అన్న పదం అందులో ఎక్కడా లేదు. ఆ చట్టం ప్రకారం పౌరుడి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, శాశ్వత, ప్రస్తుత చిరునామా, పుట్టుమచ్చ, పౌరసత్వ నమోదు తేదీ, సీరియల్‌ నెంబర్, జాతీయ గుర్తింపు నెంబర్‌ను కోరారు. కొత్త అంశాలకు కూడా చట్టబద్ధత రావాలంటే ‘2003 పౌరసత్వ చట్టం’ను సవరించక తప్పదు. 

మరిన్ని వార్తలు