31 దాకా లాక్‌డౌన్‌

18 May, 2020 04:15 IST|Sakshi

మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర హోం శాఖ

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌డీఎంఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(ఎన్‌ఈసీ) చైర్మన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆదివారం రాత్రి నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు జారీచేశారు. విమానాలు, మెట్రో రైళ్ల రాకపోకలపై ఉన్న నిషే«ధాన్ని యథాతథంగా కొనసాగించారు. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవని స్పష్టం చేశారు. నిర్ధిష్టంగా నిషేధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చారు. (ఒక్కరోజులోనే 4,987)

చిక్కుకుపోయిన వారంతా తరలింపు
దేశంలో చిక్కు కుపోయిన విదేశీ యులు, ఇతర ప్రాంతాల్లో చిక్కు కుపోయిన శ్రామికులు, భారతీయ సీఫేరర్స్, వలస కూలీలు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరుల తరలింపునకు అను మతి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయు లు, భారతీయ విద్యార్థుల తరలింపునకు అనుమతి. ప్రత్యేక రైళ్ల ద్వారా వ్యక్తుల ప్రయా ణం వంటి అంశాల్లో ఇదివరకే జారీచేసిన ప్రామాణిక నియమావళి వర్తిస్తుంది. కొవిడ్‌– 19 మేనేజ్‌మెంట్‌కు సంబంధించి జాతీయ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి. 

కట్టడి, బఫర్, రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లు 
కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. 
రెడ్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో కట్టడి జోన్లు, బఫర్‌ జోన్లను జిల్లా యంత్రాంగాలు నిర్ధేశిస్తాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని గుర్తిస్తాయి.
కట్టడి జోన్లలో కేవలం అత్యవసర సేవలనే అనుమతిస్తారు. ఆయా జోన్లలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తారు. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు తప్ప వ్యక్తులు ఈ జోన్లలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి.
కట్టడి జోన్లలో పటిష్టమైన కాంటాక్ట్‌ ట్రేసిం గ్, ఇంటింటిపై నిఘా, అవసరమైనప్పుడు వైద్య సేవలు అందించడం వంటి కార్యకలాపాలు కొనసాగుతాయి. 

రాత్రి పూట కర్ఫ్యూ
రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధం. అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుంది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 144 కింద స్థానిక యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుంది.

కట్టడి జోన్లలో అత్యవసరానికే అనుమతి 
నిర్ధిష్టంగా నిషేధించిన వాటికి మినహా ఇతర అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అయితే, కట్టడి జోన్లలో మాత్రం ఐదో నిబంధనలో పేర్కొన్నట్టుగా అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిస్థితిని అంచనా వేసి, విభిన్న జోన్లలో కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చు. అవసరమైన మేరకు ఆంక్షలు విధించవచ్చు. 

హాని పొంచి ఉన్న వారికి రక్షణ
65 ఏళ్ల వయస్సు పైబడి ఉన్నవారు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరాలు, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది.

‘ఆరోగ్యసేతు’ వినియోగం
పని ప్రదేశాలు, ఆఫీసుల్లో రక్షణ కోసం యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చూడాలి.
వ్యక్తులు ఆరోగ్యసేతు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని తరచుగా తమ ఆరోగ్య స్థితిని తనిఖీ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.

వ్యక్తులు, వస్తు రవాణాకు ప్రత్యేకం 
రాష్ట్రంలో, అంతర్రాష్ట్ర పరిధిలో వైద్య నిపుణులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అంబు లెన్స్‌ల రాకపోకలపై ఆంక్షలు కూడదు. 
ఖాళీ ట్రక్కులు సహా అన్ని రకాల వస్తు, కార్గో రవాణా వాహనాల అంత ర్రాష్ట్ర రాక పోకలపై ఆంక్షలు ఉండరాదు.
ఏ రాష్ట్రమైనా అంతర్జాతీయ భూ సరిహద్దు వద్ద వస్తు రవాణాను అడ్డుకోరాదు.

కచ్చితంగా అమలు చేయాల్సిందే 
జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద జారీచేసిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు ఏ విధంగానూ బలహీన పర్చరాదు.
అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.  వీటిని అమలు చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్‌ కమాండర్లుగా పంపాలి. వారి పరిధిలో నిబంధనల అమలుకు ఇన్సిడెంట్‌ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు.
 జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పరిధిలోని సెక్షన్‌ 51 నుంచి సెక్షన్‌ 60 మధ్య ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్‌ 180 పరిధిలో శిక్షార్హులు.  

మరిన్ని వార్తలు