విభేదాలు సహజమే!

28 Jan, 2018 02:37 IST|Sakshi
నరేంద్ర మోదీ

ప్రజాస్వామ్యంలో ఐకమత్యం కోసం కృషిచేయాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ ప్రతి ఒక్కరు ఐకమత్యం కోసం కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలోని మూఢవిశ్వాసాలను తరిమేసేందుకు, సమాజంలో మార్పు తీసుకురావటంలో బాధ్యత తీసుకోవాలని ఎన్‌సీసీ కేడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, శకటాల కళాకారులకు ప్రధాని సూచించారు. ‘బలోపేతమైన, ప్రగతిశీల దేశాన్ని నిర్మించేందుకు అవసరమైన శక్తి అందరు ఐకమత్యంగా ఉంటేనే లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు వేర్వేరుగా ఉండటంలో తప్పులేదన్నారు. కులం, మతం, సమాజం వంటి జాఢ్యాలను పక్కనపెట్టి సమాజాన్ని ఏకం చేసేందుకు ప్రతిఒక్కరు ప్రయత్నించాలన్నారు. మూఢనమ్మకాలను పారద్రోలటాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటినుంచే ప్రారంభించాలని యువతకు సూచించారు. 2019 కల్లా స్వచ్ఛభారత్‌ లక్ష్యాలను చేరటంలో చొరవతీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశసేవలో భాగంగా పౌర,మిలటరీ పురస్కారాలను పొందిన వారి గురించి యువత తెలుసుకుని ప్రేరణ పొందాలని మోదీ తెలిపారు.  

కంబోడియాతో 4 ఒప్పందాలు
భారత్‌–కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషిచేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య మధ్య రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై శనివారం ఢిల్లీలో ఒప్పందాలు జరిగాయి.

నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్‌ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కంబోడియాకు ఆరోగ్యం, రోడ్ల అనుసంధానత, డిజిటల్‌ అనుసంధానత తదితర అంశాల్లోనూ రుణసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ అని.. ప్రపంచశాంతికి ఇది పెనువిఘాతం కల్గిస్తోందని మండిపడ్డారు. కాగా, ప్రధాని  మోదీ ఫిబ్రవరి 9నుంచి నాలుగురోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. వరుసగా పాలస్తీనా, యూఏఈ, ఓమన్‌ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.  

మరిన్ని వార్తలు