పీవీ కాదు.. శంకర్ దయాళ్ శర్మ!

31 Jul, 2014 00:50 IST|Sakshi
పీవీ కాదు.. శంకర్ దయాళ్ శర్మ!

1991లో ప్రధాని పదవికి సోనియా మొదటి చాయిస్ శర్మనే
ఆయన ఒప్పుకోకపోవడంతో పీవీకి చాన్స్
రాహుల్ వ్యతిరేకతతో 2004లో సోనియా పీఎం కాలేదు
మాజీ కేంద్రమంత్రి నట్వర్‌సింగ్ వెల్లడి

 
 న్యూఢిల్లీ: ‘1991లో మొదట అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను ప్రధాన మంత్రిని చేయాలని సోనియా భావించారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల ఆ ఆహ్వానాన్ని శర్మ తిరస్కరించారు. దాంతో పీవీ నరసింహారావుకు అవకాశం దక్కింది. అప్పటికి పీవీ నరసింహరావు గురించి ఆమెకేమీ తెలియదు. ఆ తరువాత కూడా వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఎప్పుడూ లేవు’. ‘2004లో సోనియాగాంధీ ప్రధాని కాకుండా ఆమె తనయుడు రాహుల్ గాంధీనే అడ్డుకున్నారు. తన తండ్రి, నానమ్మ లాగానే తల్లిని కూడా చంపేస్తారేమోనన్న భయంతో సోనియా ప్రధాని పదవి చేపట్టడాన్ని రాహుల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ విషయంలో రాహుల్ చాలా మొండిగా వ్యవహరించారు. సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం రాహుల్ వ్యతిరేకతే కానీ.. సోనియా చెప్పినట్లు ఆమె అంతరాత్మ చెప్పడం కాదు’.. ఇలాంటి సంచలనాత్మక సమాచారంతో విదేశాంగ శాఖ మాజీ మంత్రి, ఒకప్పుడు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’ త్వరలో విడుదల కానుంది. సోనియా ప్రధాని కాకపోవడానికి వెనకున్న కారణాలను తన ఆత్మకథలో వివరించానని ఒక ఆంగ్ల వార్తాచానల్‌కిచ్చిన  ఇంటర్వ్యూలో నట్వర్ సింగ్ వెల్లడించారు. ‘కుమారుడిగా రాహుల్‌కు ఫుల్ మార్కులు వేయాలి’ అని వ్యాఖ్యానించారు. ఆ విషయాలన్నీ ఆత్మకథలో రాయవద్దని కోరుతూ సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీ ఈ మే 7న తన ఇంటికి వచ్చారని నట్వర్ తెలిపారు. అయితే, వాస్తవాలను ఉన్నదున్నట్లుగా వెల్లడించాలన్న ఉద్దేశంతో అన్ని వివరాలను తన ఆత్మకథలో పొందుపర్చానని నట్వర్ స్పష్టం చేశారు.

2004, మే 18న మన్మోహన్, ప్రియాంక గాంధీ, గాంధీల కుటుంబ స్నేహితుడు సుమన్ దూబే, తాను సమావేశమైన వివరాలను ఇంటర్వ్యూలో నట్వర్‌సింగ్ గుర్తు చేసుకున్నారు. రాహుల్ వ్యతిరేకత గురించి ఆ సమావేశంలోనే ప్రియాంక తమకు వివరించారన్నారు. యూపీఏ 1 హయాంలో నట్వర్ విదేశాంగమంత్రిగా పనిచేశారు. ‘చమురుకు ఆహారం’ కుంభకోణంలో ఇరుక్కుని 2005లో పదవిని కోల్పోయారు. అనంతరం 2008లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, కుంభకోణం విషయంలో  యూపీఏ ప్రభుత్వం తననెలా బలిపశువును చేసిందో మే 7న తనతో సమావేశమైనప్పుడు సోనియాగాంధీకి వివరించానని, అప్పుడు ఆమె విచారం వ్యక్తం చేశారని నట్వర్‌సింగ్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకా విషయాలేవీ తెలియదన్నారని, అయితే ఆమె మాటలను తాను విశ్వసించలేదని పేర్కొన్నారు. సోనియాకు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా కాంగ్రెస్‌లో ఏమీ జరగదని అందరికీ తెలుసునని నట్వర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమైన ప్రభుత్వ ఫైళ్లను పీఎంఓలోని పులోక్ చటర్జీ అనే అధికారి సోనియాగాంధీ వద్దకు తీసుకువెళ్లేవాడం టూ ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ మీడియా సలహాదారు సంజయ్ బారు వెల్లడించిన విషయాలను నట్వర్ సింగ్ సమర్ధించారు.
 
 

మరిన్ని వార్తలు