భద్రతకే పెద్దపీట!

23 Nov, 2014 02:38 IST|Sakshi
భద్రతకే పెద్దపీట!

  2015 నవకళేబర ఉత్సవానికి భారీ సన్నాహాలు
 10వేల మంది పోలీసులతో  మూడంచెల భద్రత
 150 సీసీ కెమెరాలతో నిఘా   సింహద్వారం, దక్షిణ ద్వారాలకు  స్కానర్లు
 సాగరతీరంలో 25 వాచ్‌టవర్లు
 నగరంలో 5 చోట్ల ఫిర్యాదుల బాక్సులు
 
 భువనేశ్వర్:  శ్రీజగన్నాథుని నవకళేబర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, దేవస్థాన యంత్రాంగాలు సంయుక్తంగా సన్నాహాలు చేపట్టాయి. యాత్రికుల భద్రతే లక్ష్యంగా పూరీ జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉత్సవానికి దేశ, విదేశాల నుంచి 50 లక్షలుపైగా యాత్రికులు వస్తారని  అంచనా. ఉత్సవ కార్యక్రమాల సమన్వయం కోసం పోలీసు శాఖ 14 కమిటీలను ఏర్పాటు చేస్తోంది. వీటిలో సాగరతీరం రక్షణ, జనసందోహిత నిర్వహణ, రథాల రక్షణ, ట్రాఫిక్ నిర్వహణ కమిటీలు ప్రధానమైనవి. అనుభవజ్ఞులైన పోలీసు అధికారులు పర్యవేక్షకులుగా వ్యవహిరించే కమిటీల పనితీరును 15 రోజులకోసారి సమీక్షిస్తారు. పట్టణంలో ప్రముఖ రహదారుల మరమ్మతులు పూర్తయితే ట్రాఫిక్ నిర్వహణ పనులు చేపడతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ట్రాఫిక్ నిర్వహణ పనులకు శ్రీకారం చుడతారు. వాహనాల రద్దీ నియంత్రణకు పట్టణ పరిసరాల్లో 32 ప్రాంతాల్లో పార్కింగ్ కేంద్రాల్ని ఖరారు చేశారు. వీటిలో 24 పార్కింగ్ కేంద్రాలు పట్టణం నడిబొడ్డులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాలతీపట్టొపూర్ నుంచి ఒఠొరొనొలా మధ్యలో ప్రైవే ట్ పార్కింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

 శ్రీమందిరానికి కట్టుదిట్టమైన భద్రత
 శ్రీమందిరానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఉగ్రవాద ముప్పు ఉండడంతో జల, స్థల, ఆకాశ మార్గాల్లో శ్రీమందిరానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు (ర్యాఫ్), స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ), నేషనల్ సెక్యురిటీ ఫోర్స్ (ఎన్‌ఎస్‌ఎఫ్), ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలతో ప్రత్యేక స్క్వాడ్ ఉగ్రవాద దాడులపట్ల నిఘా ఏర్పాటు చేశారు. సముద్ర మార్గం గుండా ఉగ్రవాద ముప్పు నివారణకు కోస్టుగార్డు విభాగం సహాయం కోరుతూ లేఖరాసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. శ్రీమందిరం ప్రాంగణంలో బలమైన 32 సీసీటీవీ కెమెరాల్ని అమర్చుతారు. మాలతీపట్టొపూర్-శ్రీమందిర్, చక్రతీర్థరోడ్-సుబాష్‌బోస్ ఛక్ మీదుగా శ్రీమందిర్‌కు అనుసంధానపరిచే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటవుతాయి. మొత్తం 150 సీసీటీవీ కెమెరాల్ని వినియోగిస్తారు.   వీటిని నియంత్రించేందుకు టౌన్ ఠాణాలో  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. కంట్రోల్ రూమ్ నిర్వహణకు 25 మంది సిబ్బందిని నియమిస్తారు. ఈ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు. ఏప్రిల్ నెల నాటికి శిక్షణ పూర్తి చేసి మే నెల నుంచి కంట్రోల్ రూమ్ నిర్వహణకు నియమిస్తారు.

శ్రీమందిరం దక్షిణ ద్వారం గుండా పోటు కేంద్రానికి తరలి వెళ్లే సామగ్రి తనిఖీ కోసం ప్రత్యేకంగా స్కానర్ ఏర్పాటు చేస్తారు. భక్తుల సామగ్రి తనిఖీ కోసం సింహద్వారం దగ్గర మరో స్కానరు ఏర్పాటవుతుంది. మార్చి నెలాఖరు కల్లా వీటిని ఏర్పాటు చేస్తారు. శ్రీమందిరం రక్షణ కోసం 4 వాచ్ టవర్లు ఉన్నాయి. యాంత్రిక, సాంకేతిక లోపాలతో ఇవి పని చేయడం లేదు. వీటిని పునరుద్ధరిస్తారు. మరో నెల రోజుల్లో ఈ పనుల్ని పూర్తి చేస్తారు.


 తీరం పొడవునా...
 సాగర తీరంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పెంటకోట స్టెర్లింగ్ వరకు సుమారు 6 కిలో మీటర్ల పొడవునా 24 వాచ్ టవర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గాంధీ ఘాట్ నుంచి స్వర్గద్వార్ మధ్య 90 మంది లైఫ్‌గార్డులు నిత్యం పర్యాటకులకు సహాయం అందజేస్తున్నారు. నవ కళేబర ఉత్సవం పురస్కరించుకుని అదనంగా మరో 200 మంది లైఫ్‌గార్డుల్ని నియమించేందుకు నిర్ణయించారు. సాగర తీరంలోని ప్రతి హోటల్ ముగ్గురు చొప్పున లైఫ్‌గార్డులను నియమించాలని హోటల్ యాజమాన్యాలను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి సెయింట్ జాన్ అంబులెన్స్ ఆధ్వర్యంలో 500 మంది హోమ్‌గార్డులకు ప్రాథమిక చికిత్స శిక్షణ ఇస్తారు.


 ఆటోవాలాలపై నిఘా
 ఉత్సవానికి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులకు అందుబాటులో ఉండే ఆటో రవాణాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా వేస్తుంది. ఆటో డ్రైవర్ల అక్రమాల్ని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ఖరారు చేసింది. లెసైన్స్ లేకుండా ఆటో నడిపినా, మద్యపానం చేసినా, అధిక చార్జీల మోతకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతారు. ఇటీవల 56 ఆటోల్ని అదుపులోకి తీసుకుని పీఆర్ బాండ్ మీద డ్రైవర్లను విడుదల చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. అనధికారిక ట్రావెల్ ఏజెంట్లను తొలగించేందుకు  సిటీ డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలో ట్రావెల్ ఏజెంట్ల సర్వే ప్రారంభించారు. 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎస్పీ తెలిపారు. యాత్ర, పర్యటనకు విచ్చేసే యాత్రికులు, పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్, బస్టాండు, దిగొబారెణి ఖుంటి, గౌరాంగ్ ఛొకొ, సింహద్వారం తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.  బాక్సులపైన పోలీసు విభాగం ఈ-మెయిల్, హెల్ప్‌లైను నంబర్లని సూచిస్తారు. బాక్సుల్లో పడిన ఫిర్యాదుల్ని పరిశీలించి దర్యాప్తుకు సిఫారసు చేస్తారు.


 శిథిల కట్టడాల్ని తొలగిస్తారు
 శ్రీజగన్నాథుని నవ కళేబర ఉత్సవం పురస్కరించుకుని బొడొదండొ మార్గంలో శిథిల అవస్థలో ఉన్న కట్టడాల్ని తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మార్గంలో ఇటువంటి 17 శిథిల భవనాల్ని గుర్తించారు. వీటి తొలగింపుకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటి శిథిల భవనాల తొలగింపుకు మార్గదర్శకాలు, కార్యాచరణ ఖరారు చేస్తుంది. కొన్ని భవనాలకు సంబంధించి హై కోర్టు స్టే మంజూరు అయింది. వీటి తొలగింపులో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కలెక్టరుతో కమిటి బృందం సంప్రదించి ఈ మేరకు చర్యలు చేపడుతుందన్నారు.


 ప్రమాదాల నివారణే లక్ష్యం
 నవకళేబర ఉత్సవంలో ప్రమాదాల్ని నివారించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేస్తుందని జిల్లా ఎస్పీ అశిష్ కుమార్ సింగ్ వివరించారు. పది వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు.  వీరిలో 5,000 మంది సిబ్బంది బస చేసేందుకు జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని, మిగిలినవారికి పరిసరాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీవో)లో డిప్యూటీ కమాండెంట్ లింగరాజ్ మిశ్రా అధికారిగా నవకళేబర సెల్ పని చేస్తుందని తెలిపారు. నవకళేబర ఉత్సవం కోసం అదనపు ఎస్పీ పోస్టు సృష్టించి ప్రఫుల్ల మిశ్రాని నియమించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు