పద్మ అవార్డును నిరాకరించిన సీఎం సోదరి

26 Jan, 2019 10:12 IST|Sakshi

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సోదరి, ప్రముఖ రచయిత్రి గీతా మెహతాకు పద్మ శ్రీ ప్రకటించారు. అయితే ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు గీతా మెహతా. ఈ విషయం గురించి గీతా మాట్లాడుతూ.. ‘ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు నన్ను అర్హురాలిగా భావించినందుకు నేను చాలా గర్వ పడుతున్నాను. కానీ ఈ అవార్డును తిరస్కరిస్తున్నందుకు నన్ను క్షమిం​చాలి’ అన్నారు.

ఇందుకు గల కారణాన్ని కూడా తెలిపారు గీత. ‘త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో నేను ఈ అవార్డును స్వీకరిస్తే ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేను అవార్డు స్వీకరించడం నాకు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అందుకే ఈ అవార్డును తిరస్కరిస్తున్నాను. ఇందుకు నన్ను క్షమించాలి’ అన్నారు. గీతా మెహతా  ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి అయిన బిజు పట్నాయక్ కుమార్తె.  ఆల్ప్రెడ్ ఎ.నోఫ్ పబ్లిషింగ్ హౌస్ అధిపతి సోనీ మెహతాను వివాహమాడారు. ఆమె రాసిన పుస్తకాలు 21 భాషలలో అనువాదమయ్యాయి.

మరిన్ని వార్తలు