ప్రధానులు వస్తే యుద్ధాలు జరిగాయి మీరు వస్తే..

3 Sep, 2018 12:09 IST|Sakshi
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ

చండీఘఢ్‌ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరై విమర్శలను ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి వార్తల్లో నిలిచారు. తన స్నేహితుడు.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తనకో సందేశం పంపినట్లు సిద్ధూ వెల్లడించారు.

ఈ సందేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌, పాక్‌ల మధ్య శాంతియుతమైన పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌ వచ్చి వెళ్లిన తరువాత కార్గిల్‌ యుద్ధం జరిగింది.. మోదీ పాకిస్తాన్‌ని సందర్శించిన తరువాత పఠాన్‌ కోట్‌పై దాడి జరిగింది. కానీ సిద్ధూ పాక్‌ వచ్చి వెళ్లిన తర్వాత భారత్‌లో అంతర్గత కుమ్ములాటలు జరిగాయని’ ఇమ్రాన్‌ తన సందేశంలో పేర్కొన్నట్లు సిద్ధూ తెలిపారు. అంతేకాక ‘మేము శాంతి కోరకుంటున్నాం. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మేము రెండడుగులు ముందుకు వేస్తాం’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ తనకు పంపిన సందేశంలో తెలిపినట్లు సిద్ధూ వివరించారు.

పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ 22వ ప్రధానిగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన సిద్ధూ.. పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన చర్యగా శివసేన మండిపడగా, కాంగ్రెస్‌ నాయకులు పాకిస్తాన్‌ ఏజెంట్లు అంటూ బీజేపీ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు