మూడేళ్లలో నక్సలిజం అంతం

8 Oct, 2018 03:26 IST|Sakshi
కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

ఆర్‌ఏఎఫ్‌ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌

లక్నో: రాబోయే మూడేళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను ఎదుర్కోవడంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. సీఆర్పీఎఫ్‌ అనుబంధ విభాగమైన ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌) 26వ వార్షికోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ..‘ఆ రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే 2–3 ఏళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం.

గతంలో దేశవ్యాప్తంగా 126 జిల్లాల్లో తీవ్రవాదుల ప్రాబల్యముంటే.. ఈ సంఖ్య ప్రస్తుతం 10 నుంచి 12 జిల్లాలకు పడిపోయింది. మీ (సీఆర్పీఎఫ్‌ జవాన్ల) అంకితభావం, ధైర్యం, కృషి కారణంగానే ఇది సాధ్యమైంది. ఆర్‌ఏఎఫ్‌ బలగాలు స్పందించడంలో వేగంగా ఉండాలే తప్ప ప్రజలతో దురుసుగా వ్యవహరించకూడదు’ అని తెలిపారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్‌ విశేష కృషి చేస్తోందని ప్రశంసిం చారు. భద్రతాబలగాలు 2018లో ఇప్పటివరకూ 131 మంది ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను మట్టుబెట్టాయని రాజ్‌నాథ్‌ తెలిపారు.

దీంతోపాటు 1,278 మందిని పోలీసులు అరెస్ట్‌ చేయగా, మరో 58 మంది లొంగిపోయారని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కశ్మీరీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారనీ, అయినా రాష్ట్రంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నాయని కితాబిచ్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో యాపిల్‌ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు కాల్చిచంపడంపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఆందోళనలు, అల్లర్ల సందర్భంగా ఆర్‌ఏఎఫ్‌ బలగాలు సత్వరం స్పందించాలే తప్ప ప్రజలతో దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు.

సుశిక్షితులైన భద్రతాబలగాలు ప్రజలతో దురుసుగా ప్రవర్తించి కూర్రులుగా గుర్తింపు తెచ్చుకోకూడదు. విధి నిర్వహణ సందర్భంగా ప్రజలతో ఎప్పుడు, ఎంతమేరకు, ఎలా వ్యవహరించాలన్న అంశంపై జవాన్లకు అవగాహన ఉండాలి’ అని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. దేశంలో అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 1991లో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, అలహాబాద్, ముంబై, అలీగఢ్, కోయంబత్తూర్, జంషెడ్‌పూర్, భోపాల్, మీరట్‌లో ఆర్‌ఏఎఫ్‌ బెటాలియన్లను మోహరించారు.
 

మరిన్ని వార్తలు