గన్‌ వదిలి పెన్‌ పట్టారు

22 Nov, 2018 04:08 IST|Sakshi

గడ్చిరోలి: ఆయుధాలతో సహవాసం చేసిన వారంతా ఇప్పుడు కలం, పుస్తకాలతో కుస్తీలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. చదువు విలువ తెలుసుకుని నక్సలిజాన్ని వదిలేసిన యువత, గిరిజనులు ఉన్నత విద్య కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్రలోని నక్సల్స్‌ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని కొందరు మాజీ మావోయిస్టుల గురించే ఈ ఉపోద్ఘాతమంతా. మవోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో పాటు విద్యా మౌలిక వసతుల లేమి కారణంగా అక్కడి యువత, గిరిజనులు నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు.

ఈ ఉద్యమం నుంచి బయటికొచ్చిన కొందరు పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. కుర్కేడా తాలుకాలోని ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో) స్టడీ సెంటర్‌..వారికి దూర విద్య ద్వారా ఉన్నత విద్యాభ్యాసం కొనసాగిం చేందుకు అవకాశమిచ్చింది. దీంతో లొంగిపోయిన నక్సల్స్, మధ్యలోనే చదువులు ఆపేసిన 468 మంది వేర్వేరు డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో చేరారు. కుర్కేడా పరిధిలోని 150 గ్రామాల్లో పర్యటించి విద్యాభ్యాసం కొనసాగించాలని యువతను ప్రోత్సహించినట్లు ఇగ్నో స్థానిక సమన్వయకర్త గౌరీ ఉకే చెప్పారు.

>
మరిన్ని వార్తలు