రాజ్యాంగ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలి

15 May, 2018 02:40 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్‌ ఈశ్వరయ్య

ఓబీసీ జాతీయ సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్‌

జస్టిస్‌ ఈశ్వరయ్య అధ్యక్షతన సదస్సు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓబీసీలకు రాజ్యాంగ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సంయుక్త కార్యాచరణ కమిటీ తీర్మానించింది. జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్, జస్టిస్‌ ఈశ్వరయ్య అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో 12 రాష్ట్రాల బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ..సుప్రీంకోర్టు, హైకోర్టు, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్‌ రంగాల్లో రాజ్యాంగ పరంగా ఓబీసీలకు దక్కాల్సిన 27% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇటీవల  హైకోర్టు నాయమూర్తుల నియామకంలో బీసీలు జడ్జీలుగా పనికిరారంటూ కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు నివే దికలు పంపారని గుర్తు చేశారు. సుప్రీం న్యాయ మూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కూడా అదే రీతిలో స్పందించడం సరికాదన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా ప్రస్తుతం దేశంలో 14 శాతం కూడా అమలు కావడం లేదని చెప్పారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ ఇచ్చిన తప్పుడు నివేదికలపై బీసీలకు క్షమాపణలు చెప్పాలని సీఎం చంద్రబాబును తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

తెలంగాణ శాసనసభలో 69 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా కేవలం 19 మందే ఉన్నారని, ఏపీలో 80 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా 34 మందే ఉన్నారని తెలిపారు. సదస్సులో మహారాష్ట్ర మంత్రి మహదేవ్‌ జన్కెర్, ఏపీ నుంచి ఓబీసీ నేత జి.వెంకటేశ్వర్లు, ఉమ్మడి హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు