‘ఈస్ట్‌కోస్ట్‌’ దివాలా ప్రక్రియ 

6 Apr, 2018 01:52 IST|Sakshi

అనుమతినిచ్చిన ఎన్‌సీఎల్‌టీ  

సాక్షి, హైదరాబాద్‌ :  పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు దాదాపు రూ.2,323 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనందుకు ఈస్ట్‌కోస్ట్‌ ఎనర్జీ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), హైదరాబాద్‌ అనుమతినిచ్చింది. దివాలా పరిష్కారదారు (ఐఆర్‌పీ)గా దేవేంద్రప్రసాద్‌ను నియమించింది. ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు చేయరాదని సంస్థను ఆదేశించింది. ‘‘దివాలా ప్రక్రియ ప్రారంభమైనట్టు బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) సైట్‌లో ఉంచడంతో పాటు మీడియా ద్వారా బహిరంగ ప్రకటనలివ్వండి. రుణదాతలతో కమిటీ వేసి కంపెనీ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోండి’’అని ఐఆర్‌పీని ఆదేశించింది.

ఆయనకు సహకరించాలని ఈస్ట్‌కోస్ట్‌ ప్రమోటర్లు, అధికారులను ఆదేశించింది. ఎన్‌సీఎల్‌టీ సభ్యుడు బిక్కి రవీంద్రబాబు మూడు రోజుల క్రితం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరపల్లిలో 1,320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం ఏర్పాటుకు ఎస్‌బీఐ, పీఎఫ్‌సీల నుంచి ఈస్ట్‌కోస్ట్‌ ఎనర్జీ భారీగా రుణం తీసుకుంది. ఎస్‌బీఐకి రూ.952 కోట్లు, పీఎఫ్‌సీకి గత డిసెంబర్‌ 31 నాటికి రూ.1,371 కోట్ల బకాయి ఉంది. ఏళ్లు గడుస్తున్నా రుణం ఇంకా పూర్తిగా చెల్లించలేదని ఎస్‌బీఐ తరఫు న్యాయవాది వి.కె.సాజిత్‌ చెప్పారు. బకాయిల చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని, కొంత గడువు కావాలని ఈస్ట్‌కోస్ట్‌ తరఫు న్యాయవాదులు కోరగా ట్రిబ్యునల్‌ సభ్యుడు తోసిపుచ్చారు.  

మరిన్ని వార్తలు