పాక్‌పై సీనియర్‌ నాయకుడి ప్రశంసల జల్లు!

15 Sep, 2019 12:14 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్‌కు మధ్య పరిస్థితులు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి. ఈ తరుణంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఇరుదేశాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పాకిస్తానీయులు భారతీయులను తమ ఆప్తులుగా చూస్తారంటూ పాక్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆదివారం ముంబైలోని పార్టీ కార్యాలయంలో మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శరద్‌ పవార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాకిస్తాన్‌కు వెళ్లినపుడు అక్కడి ప్రజలు మంచి ఆతిథ్యాన్ని అందించారని పేర్కొన్నారు. అంతేగాక పాకిస్తానీయులు భారత్‌లో వారి బంధువులను కలిసే వీలులేక అక్కడికి వచ్చేవారినే బంధువులుగా భావించి సకల మర్యాదలు చేస్తారని ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌లో ప్రజలు సంతోషంగా లేరని, సరైన న్యాయం కూడా లభించదన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై విష ప్రచారం చేపడుతోందని విమర్శించారు. అసలు పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేపడుతోందని ఆరోపించారు.

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం భారత్‌ పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే! అయితే ఈ నిర్ణయాన్ని శరద్‌ పవార్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నిర్ణయం వల్ల జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం మరింత పెరిగే అవకాశముందని పవార్‌ హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన దాయాది దేశం పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తి.. బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఆ దేశాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని పాక్‌ను వెనకేసుకు రావటం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు