వేసవిలో ఎన్నికలు పెట్టకూడదా?

28 May, 2018 17:48 IST|Sakshi

విదర్భ, మహారాష్ట్ర :  మహారాష్ట్రలోని భందారా-గోండియా లోక్‌సభ స్థానానికి సోమవారం జరుగుతున్న పోలింగ్‌లో నాలుగో వంతు ఈవీఎమ్‌లలో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు సమాచారం. దీని గురించి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) నాయకుడు ప్రఫుల్‌ పటేల్‌ ‘ఈవీఎంలు ఎందుకు పనిచేయటం లేదని నేను సిబ్బందిని అడిగాను. దానికి వారు చెప్పిన సమాధానం విని నేను షాక్‌ అయ్యాను. వేడి అధికంగా ఉండటం వల్ల ఈవీఎంలు పనిచేయడం లేదని సిబ్బంది సమాధానమిచ్చారన్నారు. ‘ఏప్రిల్‌ నెలల కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకని మీరు వేసవికాలంలో ఎన్నికలు నిర్వహించకూడదంటారా’ అని ప్రశ్నించాడు ప్రఫుల్‌ పటేల్‌. గుజరాత్‌లోని సూరత్‌లో వినియోగించిన ఈవీఎంలనే ఇక్కడ వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ నియోజకవర్గంలో 25 శాతం ఈవీఎంలు పనిచేయడంలేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఓటరు తన ఓటును ఏ పార్టీకి వేసాడో తెలుసుకునేందుకు ఈవీఎంలలో రూపొందించిన వీవీపీఏటీ (ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ మెషన్‌) వల్లనే ఈవీఎంలు పనిచేయకుండా మొరాయిస్తున్నట్లు తెలిపారు. కాగా వీటిని సరిచేసేందుకు ఎన్నికల సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. విదర్భలోని భందారా-గోండియా నియోజకవర్గంలో 2 వేలకుపైగా పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 71 నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉండగా, మరో 113 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు