‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’

28 Apr, 2020 17:46 IST|Sakshi

ముంబాయి: ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మహారాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టాలంటే దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలించాలన్నారు. ఈ విషయం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఆలోచించాలని కోరారు. కరోనా ప్రభావం లేని, తక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను సడలించాలని, అయితే అక్కడ కరోనా విజృంభించకుండా ఉండేందుకు మిలిటరీ రూల్స్‌ని పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, అలాంటి నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోలేమన్నారు. అయితే సామాజిక దూరాన్ని అందరూ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటూ మిలిటరీ క్రమశిక్షణను అమలు చేయగలిగితే కరోనా వ్యాప్తిని లాక్‌డౌన్‌ సడలించినప్పటికీ అరికట్టవచ్చన్నారు. (వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి)

లాక్‌డౌన్‌ సడలింపులకు సంబంధించి కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇ‍వ్వాలన్నారు. దుకాణదారులు, చిన్న చిన్న పరిశ్రమల వారు, చిరువ్యాపారులు కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. అటువంటి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రస్తుత పరిస్థితులను ఎలా అధిగమించాలో ఆలోచించాలన్నారు. తాను ఇది సరదా కోసం చెప్పడం లేదన్న ఆమె, కొన్ని నిబంధనాలు, మార్గదర్శకాలు పాటించడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వీలవుతుందన్నారు. ఇంట్లో ఉంటే మన సమస్యలు తీరవని అందుకోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిందని అలాంటి సమస్యలు మన దేశంలో రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూలే సూచించారు. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర)

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని సూచించారు. ప్రజలెవరూ సోషల్‌ మీడియాలో వచ్చే ఫేక్‌ న్యూస్‌ని నమ్మవద్దని సూలే విజ్ఞప్తి చేశారు. అధికారులు ప్రజలకు వండ్డిన భోజంన పెట్టడం కంటే వారికి నిత్యవసర సరుకులు అందిస్తే బాగుంటుందన్నారు. అదేవిధంగా విద్యార్ధులందరూ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఉండి వారి పరీక్షలకు సంబంధించి చదువుకోవడం ఉత్తమమన్నారు. లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మే3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు