ఎన్సీపీ ఎన్నికల ప్రచారం షురూ..

16 Sep, 2014 22:21 IST|Sakshi

 కొల్హాపూర్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పశ్చిమ మహారాష్ర్టలోని కొల్హాపూర్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్హాపూర్ ఎంపీ, ఎన్సీపీ నేత ధనంజయ్ మహదిక్ మాట్లాడుతూ 1999లో పార్టీని స్థాపించినప్పటి నుంచి కొల్హాపూర్ ఎన్సీపీకి అండగా ఉంటూ వస్తోందని, అందుకే ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని నిర్ణయించామని తెలిపారు.

 లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతటా నరేంద్ర మోడీ హవా నడిచినా కొల్హాపూర్‌వాసులు మాత్రం ఎన్సీపీకే పట్టం గట్టారని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి మునుపటి మద్దతు లభించడంలేదన్నది స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఈ బహిరంగ సభకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని కొల్హాపూర్ డీఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. సభకు సుమారు 70 వేల మంది హాజరయినట్లు అంచనా.. కాగా ఈ సభలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ర్ట అధ్యక్షుడు సునీల్ తట్కరే తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు