ఎన్డీ తివారి కన్నుమూత

18 Oct, 2018 16:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి(93) గురువారం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పుట్టినరోజే ఆయన మరణించడం విషాదకరం. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన తివారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా కూడా సేవలు అందించారు.బ్రెయిన్‌ స్ర్టోక్‌ రావడంతో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఆయన మ్యాక్స్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

రాజకీయ ప్రస్ధానం

1925, అక్టోబర్‌ 18న నైనిటాల్‌ జిల్లాలోని బలూటి గ్రామంలో జన్మించిన నారాయణన్‌ దత్‌ తివారీ (ఎన్డీ తివారీ) తొలుత ప్రజా సోషలిస్ట్‌ పార్టీలో పనిచేసి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. తివారీ మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా (1976-77, 1984-85, 1988-89) వ్యవహరించారు. 2002 నుంచి 2007 వరకూ ఉత్తరాఖండ్‌ సీఎంగా సేవలందించారు. రాజీవ్‌ గాంధీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. దీర్ఘకాలంలో కాంగ్రెస్‌లో కొనసాగిన తివారీ ఆశీస్సులతోనే 2017, జనవరి 18న ఆయన కుమారుడు రోహిత్‌ శేఖర్‌ తివారీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

వెంటాడిన వివాదాలు
ఎన్డీ తివారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరించిన సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజ్‌భవన్‌లోనే తివారీ మహిళలతో రాసలీలలు సాగించారన్న వార్తలు కలకలం​రేపడంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక 2008లో తివారీ తనకు జన్మనిచ్చిన తండ్రి అంటూ రోహిత్‌ శేఖర్‌ తివారీ పితృత్వ దావా దాఖలు చేశారు. కోర్టు డీఎన్‌ఏ పరీక్షలకు ఆదేశించగా రోహిత్‌ తివారీ కుమారుడేనని 2012 జులై 27న ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2014 మార్చి 3న రోహిత్‌ శేఖర్‌ను తన కుమారుడిగా తివారీ అంగీకరించారు. 2014 మే 14న శేఖర్‌ తల్లి ఉజ్వలా తివారీని వివాహం చేసుకున్నారు.

ప్రముఖుల సంతాపం
ఎన్డీ తివారి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కార్యదక్షత కలిగిన ఆయన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి పాటు పడ్డారని ప్రశంసించారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలు అందించిన తివారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌ సంతాపం ప్రకటించారు. తివారి మరణంతో దేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడుని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఎన్డీ తివారికే దక్కిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. తివారి మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు