మోదీ సర్కార్‌ ముందు ఆర్థిక ఉచ్చు!

1 Jun, 2019 15:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :అఖండ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసరంగా దేశ ఆర్థిక పరిస్థితిపై దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఏర్పడిందని దేశ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2019 జనవరి నుంచి మార్చి వరకు మొదటి త్రైమాసంలో దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 5.8కి పడిపోవడం ఆందోళనకరమని, గత ఐదేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయికి జీడీపీ రేటు పడిపోలేదని వారంటున్నారు. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగ శాతం 6.1 శాతానికి చేరుకుందని, ఇది గత 45 ఏళ్లలో ఇదే గరిష్టమని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నిర్వహించిన పీరియాడికల్‌ సర్వే తేలిందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పుండు మీద కారం చల్లిన చందమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

2017–18 సంవత్సరం తర్వాత దేశంలోని నిరుద్యోగ సమస్యపై పీరియాడికల్‌ సర్వేలను కేంద్రం నిలిపి వేసిందని, వాస్తవానికి దేశంలో నిరుద్యోగ సమస్య 2018–19 సంవత్సరానికి 6.6 శాతానికి చేరుకుందని, ఇది ఆల్‌టైమ్‌ రికార్డని భారతీయ ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల ఆ రంగం నుంచి ఏటా 60 నుంచి 70 లక్షల మంది ఉపాధి కోసం ఇతర రంగాలకు మల్లుతున్నారని వారు చెప్పారు. దీనికి అదనంగా కోటి ఇరవై లక్షల నుంచి కోటీ ముప్పై లక్షల మంది యువకులు ఉద్యోగ పర్వంలోకి అడుగుపెడుతున్నారని, వీరందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఇప్పటి ఐదేళ్లపాటు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని న్యూయార్క్‌లోని స్టేట్‌ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శతి రాజగోపాలన్‌ హెచ్చరించారు. ఇది జరగకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో దాదాపు పది కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటుందని, ఎన్నికలపై వారి ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు. 

2019 లోక్‌సభ ఎన్నికల నాటికే భారత దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతో బీజేపీకి ఓటేశారని, ఒకటి, రెండేళ్లు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్న యువతకు అది అప్పుడు అంత తీవ్రంగా అనిపించదని, ఐదేళ్ల పాటు నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా తానెంతో బలవంతుడినని నిరూపించుకున్న మోదీ ఎక్కడ దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా దష్టి పెట్టరేమోనని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు