ఒక్క రోజులో 16,922

26 Jun, 2020 06:40 IST|Sakshi

మొత్తంగా 4.73లక్షల కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 16,922 కొత్త కేసులు నమోదు కాగా, మరో 418 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు 4,73,105కు, కోవిడ్‌ మరణాలు 14,894కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా 2,71,696 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 57.43 శాతానికి పెరిగిందని పేర్కొంది. దేశంలో నమోదైన మొత్తం యాక్టివ్‌ కేసులు 1,86,514 అని తెలిపింది. ఈ నెల 24వ తేదీ వరకు 75,60,82 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 2,07,871 నమూనాల్లో పాజిటివ్‌గా నిర్ధారణయ్యాయని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. భారత్‌లో ప్రతి లక్ష జనాభాకు 33.39 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ సహా మూడు రాష్ట్రాలకు కేంద్ర బృందం
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేసేలా రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేందుకు ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటించనుంది.

జర్మనీలోని అతిపెద్ద జంతువధశాలలో భారీగా కోవిడ్‌ కేసులు బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రైన్‌–వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోని గ్యెటర్స్‌ జిల్లాలోని టోనీస్‌ గ్రూప్‌నకు చెందిన జంతువధశాలలో పనిచేసే సిబ్బందిలో 1,500 మందికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం ఆ స్లాటర్‌హౌస్‌ పరిసర రెండు జిల్లాల్లో తక్షణమే లాక్‌డౌన్‌ను ప్రకటించింది. 5 కరోనానిర్ధారణ కేంద్రాలను ఏర్పాటుచేసింది.

>
మరిన్ని వార్తలు