మారిటల్ రేప్ లపై స్వరం మార్చిన మేనక

9 Apr, 2016 13:37 IST|Sakshi
మారిటల్ రేప్ లపై స్వరం మార్చిన మేనక

న్యూఢిల్లీ: మారిటల్ రేప్(భార్యపై అత్యాచారం) నేరమా? కాదా? అనే చర్చ మరో మలుపు తిరిగింది. భారత సంప్రదాయాలు, ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా  మారిటల్ రేప్ ను నేరపూరిత చర్యగా పరిగణించలేమని గతంలో వెల్లడించిన కేంద్ర మంత్రి మేనకా గాంధీ తాజాగా స్వరం మార్చారు. సరైన ఆధారాలు లభించిన పక్షంలో మారిటల్ రేప్ ను క్రైమ్ గా పరిగణించే వీలుంటుందని, ఎక్కువ మంది బాధిత మహిళలు ఫిర్యాదులు చేయడం ద్వారానే ఇది వీలవుతుందని శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో  అన్నారు. మారిటల్ రేప్ ను క్రైమ్ గా పరిగణించేందుకు కొత్తచట్టాలు అవసరం లేదని మేనక స్పష్టం చేశారు.

భారత శిక్షా స్మృతిలోని 375సి సెక్షన్ ప్రకారం మహిళ అంగీకారం లేకుండా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల బృందం ఆమెను బలవంతపెట్టడం అత్యాచారంగా పరిగణిస్తారు. అయితే భార్యలను హింసించే భర్తల విషయంలోనూ ఈ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో పలువురు సభ్యులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన కేంద్రం.. మారిటల్ రేప్ ను నేరంగా పరిగణించబోమని చెప్పింది.

కాగా, ఇటీవల జాతీయ న్యాయ కమిషన్.. అత్యాచార చట్టాలను సమీక్షించడం, భార్యపై  అత్యాచారం కూడా నేరంగా పరిగణించాలని సూచించినందువల్ల మాతాశిశు సంక్షేమ శాఖ తన విధానంలో మార్పులు చేసుకుంది. అంతేకాక పార్లమెంట్ లో చెప్పిన సమాధానాన్ని కూడా మార్చుకోవాలని భావిస్తున్నది. 'అత్యాచారాల నిరోధానికి ఇప్పుడున్న చట్టాలనే చాలామంది వినియోగించుకోవటం లేదు. మారిటల్ రేప్ విషయంలో కొత్త చట్టం అవసరం లేదు. బాధిత మహిళలు ఎక్కువ మంది బయటికి వచ్చి ఫిర్యాదు చేసినట్టయితే  ఆ ఆధారాలను బట్టి  మారిటల్ రేప్ ను క్రైమ్ గా పరిగణించే వీలుంటుంది' అని మేనకా గాంధీ అన్నారు.

మరిన్ని వార్తలు