3 కాదు.. 5 ‘సీ’లను అలవరచుకోవాలి

24 Nov, 2017 03:48 IST|Sakshi

సాక్షి, చెన్నై: సాధారణంగా సమాజంలో క్యాస్ట్‌ (కులం), కమ్యూనిటీ (వర్గం), క్యాష్‌ (డబ్బు) అనే మూడు ‘సీ’లు కనిపిస్తుంటాయనీ, అలాకాకుండా క్యారెక్టర్‌ (వ్యక్తిత్వం), క్యాలిబర్‌ (సామర్థ్యం), కెపాసిటీ (శక్తి), కండక్ట్‌ (ప్రవర్తన), కంపాషన్‌ (కరుణ) గుణాలను విద్యార్థులు అలవరచుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. నేటి డిజిటల్‌ యుగానికి తగ్గట్లుగా విద్యాలయాల్లో బోధనా ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు.

చెన్నై శివార్లలోని కాటాన్‌ కొళత్తూరులో ఉన్న ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన స్నాతకోత్సవంలో వెంకయ్య మాట్లాడారు. ధార్మిక చింతన లేకుండా సైన్స్‌ మాత్రమే చదువు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారైందని విమర్శిస్తూ, బహుముఖ ప్రజ్ఞతో కూడిన విద్యతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.  దాదాపు 6 వేల మంది విద్యార్థులు పట్టాలను అందుకున్న ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్, వర్సిటీ చాన్స్‌లర్‌ పారివేందర్, అధ్యక్షుడు సత్యనారాయణన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు