దేశవ్యాప్తంగా నేడు నీట్‌

6 May, 2018 04:21 IST|Sakshi

రాష్ట్రంలో 9 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు

రాష్ట్రంలో పరీక్ష రాయనున్న 49,210 మంది అభ్యర్థులు

దేశవ్యాప్తంగా 13.26 లక్షల మంది అభ్యర్థులు

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌)ను నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, రాజమండ్రిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 49,210 మంది, తెలంగాణలో 50,856 మంది నీట్‌ రాస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల లోపలికి ఉదయం 7.30 నుంచి 9.30 గంటల్లోపు చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చినవారిని లోపలికి అనుమతించరు. దేశవ్యాప్తంగా దాదాపు 13,26,725 మంది పరీక్షకు హాజరవుతున్నారని సీబీఎస్‌ఈ తెలిపింది.

నిబంధనలివే..
నేడు నిర్వహించనున్న నీట్‌కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా, పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు అభ్యర్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని, రింగులు, చైన్‌లు, వాచీలు నిషిద్ధమని చెప్పారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్‌ వస్తువు (ఫోన్లు, ట్యాబ్‌లు, బ్లూటూత్‌లు, కాలిక్యులేటర్లు)లను అనుమతించబోమని వెల్లడించారు. అమ్మాయిలు జడ వేసుకుని పరీక్షకు రావాలని పేర్కొన్నారు. అబ్బాయిలు ఫార్మల్‌ డ్రెస్‌లో రావాలని బిగుతుగా ఉన్న జీన్స్‌ ధరించకూడదన్నారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బూట్లు ధరించి పరీక్షకు రాకూడదని తెలిపారు. పరీక్ష రాయడానికి పెన్ను, పెన్సిల్‌ను కూడా నిర్వాహకులే ఇస్తారని చెప్పారు.

ఈ ఏడాది జాతీయ పూల్‌లో..
ఈ ఏడాది ఒక్క జమ్మూకశ్మీర్‌ మినహా అన్ని రాష్ట్రాలు జాతీయ పూల్‌లోకి వచ్చాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం జాతీయ పూల్‌కు ఇస్తే.. మిగతా రాష్ట్రాలు ఇచ్చే సీట్లలో మనమూ పోటీ పడొచ్చు. మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో 1900 సీట్లు, ప్రైవేటులో 2200కు పైగా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 1900 సీట్లలో 15 శాతం సీట్లు జాతీయ పూల్‌ కోటా కింద ఇస్తారు. దేశవ్యాప్తంగా 52,105 ఎంబీబీఎస్‌ సీట్లుండగా అందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 27,710 సీట్లున్నాయి. ఇందులో 15 శాతం అంటే 4,157 సీట్లు వస్తాయి. ఏపీ నుంచి మరో 285 సీట్లు కలిపితే మొత్తం 4,442 సీట్లు అందుబాటులో ఉంటాయి.  

>
మరిన్ని వార్తలు