ఆ విద్యార్థినికి క్షమాపణ చెప్పండి

10 May, 2017 00:52 IST|Sakshi
ఆ విద్యార్థినికి క్షమాపణ చెప్పండి

► ‘నీట్‌’కేంద్రంలో లోదుస్తులు తీయించిన ఘటనపై సీబీఎస్‌ఈ
► నలుగురు మహిళా టీచర్ల సస్పెన్షన్‌
► కేంద్రం దృష్టికి తీసుకెళతాం: కేరళ సీఎం


న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఇటీవల జరిగిన జాతీయ స్థాయి మెడికల్‌ ప్రవేశపరీక్ష ‘నీట్‌’లో డ్రెస్‌ కోడ్‌పై కఠిన నిబంధనలు పెట్టి, కేరళలో విద్యార్థిని లోదుస్తులు సైతం తొలగించిన ఘటనపై సీబీఎస్‌ఈ చర్యలు చేపట్టింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో విద్యార్థినికి క్షమాపణలు చెప్పాల్సిందిగా సదరు పరీక్షా కేంద్రం ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది. ఈ ఘటన దురదృష్టకరమంది. దీంతో పాటు కేరళలోని నలుగురు మహిళా టీచర్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇది అత్యుత్సాహంతో జరిగిన ఘటనగా పేర్కొంది.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) చైర్మన్‌ ఆర్కే చతుర్వేది మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అనంతరం ఈమేరకు చర్యలు తీసుకుంది. అలాగే మరో విద్యార్థి షర్ట్‌ పొడుగు చేతులు కత్తిరించమన్నందుకు ఎర్నాకులంలోని ఓ పరీక్ష కేంద్రం అధికారులపైనా వేటు వేసింది. అయితే అత్యున్నత స్థాయి పరీక్ష అయినందున కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సి వచ్చిందంటూ సీబీఎస్‌ఈ ప్రతినిధి రమాశర్మ సమర్థించుకున్నారు. ఈ నెల 7న నీట్‌ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల డ్రెస్‌కోడ్‌ అమలుకు సంబంధించి దిగ్భ్రాంతికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

విచారణకు ఆదేశించాం: సీఎం
మరోవైపు, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది మానవత్వాన్ని అవమానపరచడమేనన్నారు. విద్యార్థుల దుస్తులు తొలగించడం, మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు చేయడం క్రూరమైన, అమానవీయ, అవమానకర చర్యలని ప్రతిపక్ష నాయకుడు రమేష్‌ చెన్నిత్తాల వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని, పోలీసు విచారణకు ఆదేశించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. దీనిపై పది రోజుల లోగా నివేదిక ఇవ్వాలని కేరళ బాలల హక్కుల కమిషన్‌ సీబీఎస్‌ఈని కోరింది.

మరిన్ని వార్తలు