రుతుపవనాలకు అననుకూల పరిస్థితులు 

27 May, 2019 03:18 IST|Sakshi

జూన్‌ 6న కేరళను తాకే అవకాశం  

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంపై క్రాస్‌–ఈక్వెటోరియల్‌ ఫ్లో అననుకూలంగా ఉన్న కారణంగా రుతుపవనాల కదలికల్లో పురోగతి లేదని, రుతుపవనాలు ఆలస్యం కావడానికి ఇదో కారణమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆది వారం వెల్లడించింది. మే 18న రుతుపవనాలు అండమాన్, నికోబార్‌ దీవులను తాకినప్పటికీ ఆ ప్రాంతం మొత్తానికి ఇంకా విస్తరించలేదు. బుధ లేదా గురువారం నాటికల్లా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ దీవులు, ఉత్తర అండమాన్‌ సముద్రం ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. అలాగే సాధారణం కన్నా ఐదు రోజులు ఆలస్యంగా, జూన్‌ 6న కేరళను రుతుపవనాలు తాకొచ్చని పేర్కొంది.

హిందూ మహా సముద్రంలోని దక్షిణ భాగంలో మ్యాడెన్‌–జూలియన్‌ ఆసిలేషన్‌ (ఎంజేవో), యాంటి–సైక్లోన్‌ సర్క్యులేషన్‌ అనుకూలంగా లేకపోవడం వల్ల క్రాస్‌–ఈక్వెటోరియల్‌ ఫ్లో సరిగ్గా లేదని ఐఎండీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మోహపాత్ర చెప్పారు. బుధ, గురువారాల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అలాగే ఆదివారం నుంచి మంగళవారం మధ్యలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటకల్లోనూ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వడగాడ్పులు కొనసాగుతాయని తెలిపింది.   

మరిన్ని వార్తలు