నెహ్రూ వారసత్వాన్ని తుడిచేస్తున్నారు

19 Nov, 2014 05:24 IST|Sakshi
నెహ్రూ వారసత్వాన్ని తుడిచేస్తున్నారు

న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వంపై పోరు మంగళవారం తీవ్రమైంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయన విలువల వారసత్వాన్ని చరిత్ర నుంచి తుడిచేసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. నెహ్రూ స్మారక సదస్సు నిర్వహణకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించిందని విమర్శించింది. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన రెండు రోజుల జవహర్‌లాల్ నెహ్రూ స్మారక అంతర్జాతీయ సదస్సు మంగళవారమిక్కడ ముగిసింది.

 

ముగింపు సమావేశంలో పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రసంగించారు. నెహ్రూ వారసత్వాన్ని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ రాహుల్, సోనియాలు మోదీ సర్కారుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తొలి ప్రధాని భావనలు, రాజకీయ అభిప్రాయాలు ఇప్పటికీ అనుసరణీయమేనని రాహుల్ అన్నారు.
 
 ‘ఆయనను, ఆయన అపురూపంగా అందించిన వారసత్వాన్ని దేశం నుంచి తుడిచిపెట్టేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎవరి మాటనూ నిరాకరించని ఆయన వారసత్వాన్ని మనం 70 ఏళ్లుగా కాపాడుకుంటున్నాం. ఇకపైనా కాపాడుకోవాలి’ అని పేర్కొన్నారు.   సోనియా మాట్లాడుతూ.. ‘నెహ్రూ భావనలకు ప్రస్తుతం సవాలు ఎదురవుతోంది. మనం వాటిని కట్టుబడి ఉండడమేకాకుండా ప్రజాస్వామ్యాన్ని, సమీకృతత్వాన్ని, లౌకికవాదాన్ని బలోపేతం చేయడానికి గట్టిగా పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. నెహ్రూ ప్రేమాదస్పదుడని, దృఢవిశ్వాసాలున్న గొప్ప నాయకుడని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు.  నెహ్రూ అనుసరించిన ప్రజాస్వామ్యం, సాధికారతలకు ఎప్పుడూ విలువ ఉంటుందని సదస్సు తీర్మానం చేసింది. ‘నెహ్రూ ప్రాపంచిక దృక్పథం, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్న ఈ తీర్మానాన్ని ఘనా మాజీ అధ్యక్షుడు  కుఫోర్ చదివి వినిపించారు.
 
 ‘సదస్సు ప్రభుత్వానికి ఇష్టం లేదు’
 
 సదస్సు నిర్వహణకు మోదీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు. ‘సదస్సు జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదు.  విజ్ఞాన్‌భవన్ ఈ నెల 14న(నెహ్రూ జయంతి) ఖాళీగా ఉన్నా ఆ రోజు కార్యక్రమం జరుపుకోవడానికి మాకు అనుమతివ్వలేదు. సదస్సుకు సంబంధించి ప్రపంచనేతలు ఎవరైనా వాకబు చేస్తే నేరుగా కాంగ్రెస్ పార్టీని సంప్రదించాలని భారత ఎంబసీలకు చిన్న సర్క్యులర్ జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకా మరెన్నో ఆటంకాలు సృష్టించారు’ అని ఆరోపించారు.

మరిన్ని వార్తలు