ఆ ప్రమాదంలో బోస్ చనిపోకపోయి ఉండొచ్చు!

1 Apr, 2016 13:18 IST|Sakshi
ఆ ప్రమాదంలో బోస్ చనిపోకపోయి ఉండొచ్చు!

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం.. ఎన్నివిచారణలు జరిగినా, ఎన్నికమిటీలు వేసినా, మరెన్ని నివేదికలు బహిర్గతం చేసినా ఇప్పటికీ అంతుపట్టని ఓ రహస్యం. ఆయన గురించి వార్తా కథనాలు వెలువడినప్పుడల్లా అందులో ఏదో ఉందని తెలుసుకునే ఆసక్తి. నేతాజీ అదృశ్యానికి సంబంధించి ఇటీవల ఎప్పటి నుంచో రహస్యంగా ఉన్న ఫైళ్లను బయటపెట్టిన విషయం తెలిసిందే. 1945 ఆగస్టు 18న ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చెబుతున్నా.. తాజాగా బయటపెట్టిన ఫైళ్లు మాత్రం ఆ విషయంపై ఓ స్పష్టతను ఇవ్వలేక తిరిగి పాత ప్రశ్ననే మిగిల్చాయి.

ఆ విమాన ప్రమాదం నుంచి నేతాజీ బతికి బయటపడ్డారని అప్పట్లో కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. 1992నాటి ఒక ఐదు పేజీల నోట్ లో సుభాష్ బతికే ఉన్నట్లుగా వెల్లడించాయి. అలా వెల్లడించిన నోట్ పై ఎలాంటి పేరుగానీ, తేదిగానీ లేదు. అది ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చినట్లుగా ఉంది. నాటి బెంగాల్ గవర్నర్ ఆర్జీ కేసీ కార్యాలయంలో విధులు నిర్వహించే పీసీ ఖర్ అనే ఉద్యోగి చెప్పిన ప్రకారం నేతాజీకి సంబంధించి మూడు పత్రికా కథనాలను(డిసెంబర్ 1945, జనవరి, ఫిబ్రవరి 1946)  గవర్నర్ కార్యాలయ పర్యవేక్షణ సిబ్బంది స్వీకరించింది. అందులోని ఒక కథనంలో ' భారత దేశ స్వాతంత్ర్యం కోసం నా గుండె రగులుతోంది. అహింసతో స్వాతంత్ర్యం రానట్లయితే మనం రెండేళ్లలో స్వాతంత్ర్యం తెచ్చుకోవాల్సిందే'  నేతాజీ చెప్పినట్లు ఉండగా నేతాజీ మహాత్మాగాంధీ పట్ల గౌరవంతో ఉండేవారని కూడా చెప్పింది.

1946 ఫిబ్రవరి నెలలో వెలువడిన కథనం మాత్రం నేతాజీ భారత మాత గౌరవించదగిన పుత్రుడని తెలిపింది. అలాగే, అసలు విమాన ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లేవని, ఆయన అంత్యక్రియల నివేదిక సర్టిఫికెట్ బోస్ జపాన్ సైన్యంలో ఒక హోదా లేని ఉద్యోగి అని తెలిపిందని, చనిపోయిన వ్యక్తి పుట్టిన తేదికి నేతాజీ పుట్టిన తేదికి అస్సలు పోలికలేదని పేర్కొంది. దీంతోపాటు నేతాజీకి ముస్సోలిని, స్టాలిన్ ఇష్టం అని, అంతేకాకుండా నేతాజీ మంచి భోజన ప్రియుడని, బీఫ్ కూడా తినేవాడని పేర్కొంది. నేతాజీ గొప్ప హిందుత్వ వాదని కూడా నాటి వార్త కథనాలు వెల్లడయ్యాయి.

మరిన్ని వార్తలు