‘సిద్ధుని తీసేయండి.. లేకుంటే ఆ షో చూడం’

16 Feb, 2019 10:14 IST|Sakshi

సిద్ధు వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు

చండీగఢ్‌ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రజలు భగ్గుమన్నారు. సోషల్‌ మీడియా వేదికగా సిద్ధుపై దుమ్మెత్తిపోస్తున్నారు.  43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై సిద్దూ స్పందిస్తూ.. ‘కొంతమంది కోసం మీరు దేశం మొత్తాన్ని నిందిస్తారా?  హింసను ఎప్పుడూ ఖండించాల్సిందే. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించాల్సిందే. పాకిస్తాన్‌తో.. భారత్‌ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు పునరావృతమవ్వవు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పాక్‌కు వత్తాసుగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో సోని టీవీలో ప్రసారమయ్యే ‘ది కపిల్‌ శర్మ షోను నిషేదించాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే ఈ షో నుంచి సిద్ధూనన్న తీసేయాలని పట్టుబడుతున్నారు.

ఈ షోను చూడకపోతే.. రద్దవుతోందని, ఇది అమరజవాన్లకు నిజమైన నివాళని పిలుపునిస్తున్నారు. సిద్ధూకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని కూడా కామెంట్‌ చేస్తున్నారు. ‘దేశ రక్షణ కోసం 40 మంది ప్రాణ త్యాగం చేస్తే.. సిగ్గులేకుండా పరాయి దేశానికి వత్తాసు పలుకుతావా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత జవాన్లపై ఏ మాత్రం గౌరవం ఉన్న సోనీ టీవీ వెంటనే కపిల్‌ శర్మ షో నుంచి సిద్ధుని తీసేయాలని సూచిస్తున్నారు. గతంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో సిద్ధు తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే

జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారకంగా పాకిస్తాన్‌పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్‌ స్ట్రైక్‌ 2 జరపాల్సిందేనని యావత్‌ భారత్‌ ముక్తకంఠంతో భారత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల విషయంలో భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు