ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?

3 Jul, 2020 14:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ట్విటర్‌లో ఫొటోలు షేర్‌ చేస్తున్న నెటిజన్లు!

‘‘ప్రేమతో ముడిపడిన రెండు మనసులు.. ఒకరినొకరు అర్థం చేసుకున్న ఇద్దరు మనుషులు.. నువ్వూ-నేనూ సమానం అనే భావనతో మెలిగే ప్రేమికులు.. తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి జరుపుకొనే తొలి ‘వేడుక’ పెళ్లి. అది పెద్దలు కుదిర్చిన వివాహమైనా లేదా ప్రేమ పెళ్లైనా కాబోయే దంపతుల మధ్య స్నేహం, దాపరికం లేకుండా ఏ విషయాన్నైనా పంచుకోగల చనువు, ఎదుటి వ్యక్తి ప్రతీ భావనను అర్థం చేసుకోగల మనసు ఉంటే చాలు.’’

అలాంటప్పుడు అంగరంగంగా వైభవంగా జరిగినా లేదా అత్యంత సన్నిహితుల మధ్య చట్టబద్ధంగా రిజిస్టార్‌ ఆఫీసులో జరిగినా.. ఆ ‘వేడుక’ వధూవరులకు జీవితాంతం మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. అంతేతప్ప వివాహిత మెడలో వేసుకునే మంగళసూత్రం, నుదుటిన సింధూరం ఉంటే మాత్రమే వారు భర్తతో కలిసి ఉండేందుకు అర్హులని, లేదంటే విడాకులు ఇస్తామంటారా?.. ఇదెక్కడి న్యాయం? అంటున్నారు కొందరు నెటిజన్లు. (భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులు మంజూరు)

సంప్రదాయాలను తాము గౌరవిస్తామని.. అయితే అదే సమయంలో ఆత్మాభిమానాన్ని వదులుకునేందుకు ఎంత మాత్రం ఇష్టపడమని కరాఖండిగా చెబుతున్నారు. ఇందులో భాగంగా #WithoutSymbolsOfMarriage అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. తమ పెళ్లి సమయంలో దిగిన, ప్రస్తుత ఫొటోలను షేర్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. హిందూ వివాహ బంధానికి సంబంధించి ఇటీవల గౌహతి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన మహిళ సంప్రదాయం ప్రకారం నుదుటిన సింధూరం, చేతులకు గాజులు ధరించేందుకు ఇష్టపడకపోతే సదరు వివాహిత పెళ్లిని తిరస్కరించినట్టేనని పేర్కొంది. ఇతరత్రా కారణాలతో పాటు ఈ రెండింటిని ప్రధాన కారణాలుగా చూపి విడాకులు కోరిన ఓ భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఇక అప్పటి నుంచి కొంత మంది మహిళా నెటిజన్లు ఈ విధంగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘గౌరవనీయమైన న్యాయస్థానమా... వైవాహిక బంధం సాఫీగా సాగిపోతుందనడానికి గాజులు, సింధూరం, బిందీ, మంగళసూత్రం మాత్రమే గుర్తులు కావు. ఇవన్నీ ధరించాలా లేదా అన్నది మా ఇష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇంకో విషయం.. ఇవన్నీ లేకుండానే భర్తతో అందమైన జీవితం గడుపుతున్నాం. ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు’’అంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా