ఆధార్‌ లీకేజీ కలకలం!

25 Mar, 2018 03:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ భద్రతపై వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరో రుజువు దొరికింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఓ కంప్యూటర్‌లో ఆధార్‌ కార్డు ఉన్న వారి వ్యక్తిగత సమాచారం, పేర్లు, 12 అంకెలుండే ఆధార్‌ నంబర్‌తోపాటు బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు కూడా లభ్యమయ్యాయని బిజినెస్‌ టెక్నాలజీ న్యూస్‌ వెబ్‌సైట్‌ జెడ్‌డీ నెట్‌ తెలిపింది. అయితే, ఏ సంస్థ కంప్యూటర్లలో ఇలా ఆధార్‌ సమాచారం దొరుకుతోందో జెడ్‌డీ నెట్‌ వెల్లడించలేదు. అయితే, ఈ పరిణామం ఆధార్‌ భద్రతను ప్రశ్నార్ధకం చేస్తోందని నిపుణులు అంటున్నారు.

ఆధార్‌ వివరాలు తెలుసుకునేందుకు ముందుగా యూనిఫాం రిసోర్స్‌ లొకేటర్‌ను గుర్తించాల్సి ఉంటుంది..దీనిని కేవలం 20 నిమిషాల్లోనే కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థల కంప్యూటర్లలో ఇటువంటివి జరుగుతున్నట్లు తెలిసినా వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. అయితే, ఆధార్‌ సమాచారం లీకవుతోందంటూ వచ్చిన వార్తలను యూఐడీఏఐ ఖండించింది. ఆధార్‌ వివరాలకు పూర్తి భద్రత, రక్షణ ఉందని తెలిపింది. లీకేజీ వాస్తవమనుకున్నప్పటికీ వెల్లడైన సమాచారం ఆ రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందినదై ఉంటుందనీ, దానికి ఆధార్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఆధార్‌ సంఖ్య తెలిసినా∙పూర్తి వ్యక్తిగత సమాచారం లీకయినట్లు కాదని పేర్కొంది.

మరిన్ని వార్తలు