కొత్తగా రెక్కలొచ్చేనా..

23 Aug, 2018 02:32 IST|Sakshi

ఐఐటీల్లో నయా జోష్‌

కొత్త పుంతలు తొక్కుతున్న పరిశోధనలు

అమల్లోకి ప్రపంచస్థాయి బోధనా పద్ధతులు

ప్రొఫెసర్లుగా యువ తరానికి పెద్దపీట

పారిశ్రామికరంగం సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

కళలు, హ్యుమానిటీస్‌ రంగాల్లోనూ కోర్సులకు శ్రీకారం

నానో మెటీరియల్స్, బ్రెయిన్‌ రీసెర్చ్‌ వంటి రంగాలపై ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు.. ఐఐటీలు కేంద్రంగా పుట్టుకొస్తున్న నూతన స్టార్టప్‌లు, కంపెనీలు

దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యకు దిక్సూచిలవి.. యావత్‌ యువతరం చోటు కోసం కలలుగనే, పోటీ పడే విద్యా కుసుమాలవి... విద్యార్థులను బట్టీ చదువులు, మార్కుల యంత్రాలుగా మార్చడంపై కాకుండా యువ మస్తిష్కాలను నూతన ఆవిష్కరణలవైపు నడిపించే ‘ఫ్యాక్టరీ’లవి... ‘ఇన్ఫోసిస్‌’ నారాయణమూర్తి, ‘గూగుల్‌’ సుందర్‌ పిచాయ్, ‘ఫ్లిప్‌కార్ట్‌’ సచిన్‌ బన్సల్, ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ నికేష్‌ అరోరా వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన కేంద్రాలవి... అవే...దేశ అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్న ఐఐటీలు (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు). ఇప్పుడు ఈ సంస్థలు పూర్వ వైభవానికి మరిన్ని హంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

దేశంలోని 23 ఐఐటీలలో ఉన్న సీట్లు దాదాపు ఏడు వేలు! కానీ పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం లక్షలకు లక్షలు! ఈ ఒక్క విషయం చాలు దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్‌ ఏ పాటిదో అర్థం చేసుకునేందుకు. అయితే దశాబ్దాలుగా ఒకే రకమైన కోర్సులు, సిలబస్‌తో నడుస్తున్న ఈ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు అనుసరించే బోధనా పద్ధతులు పాటించడంతోపాటు వేర్వేరు సమస్యల పరిష్కారానికి వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పరిశోధనలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సైన్స్‌ ఇంజనీరింగ్‌లతోపాటు కళలు, హ్యుమానిటీస్‌ అంశాల్లోనూ కోర్సులు ప్రారంభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసే విషయంలో విద్యార్థులకు స్వేచ్ఛ, సౌలభ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. ఫలితంగా యువతరం మోసుకొచ్చే కొత్త ఆలోచనలు, పద్ధతులతో పరిశోధనలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

ప్రొఫెసర్లుగా యువతకు ప్రాధాన్యం...
ఐఐటీ ప్రొఫెసర్లంటే తల నెరసిన వారే ఉంటారన్న పాతకాలపు ఆలోచనలకు తెరదించుతూ యాజమాన్యాలు యువతరానికి పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఐఐటీ అధ్యాపకుల సగటు వయసు 1980 ప్రాంతంలో 60 ఏళ్లు కాగా.. ఇప్పుడు అది 40కు తగ్గిపోయింది. గత ఐదేళ్లలో స్వదేశానికి తిరిగొచ్చిన యువ శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఐఐటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లలో చేరుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2007–12తో పోలిస్తే ఆ తరువాతి ఐదేళ్లలో విదేశాల నుంచి తిరిగొస్తున్న శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫెలోషిప్‌లు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.

కలివిడిగా.. వడివడిగా...
పరిశోధనలంటే సామాన్యులకు ఉపయోగపడేవి కావన్న ఒకప్పటి అంచనాను తారుమారు చేస్తూ ఐఐటీ, ఐఐఎస్‌సీలు దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాజెక్టులతోపాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు, టెక్నాలజీతో సామాన్యుడి కష్టాలు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా మునుపటి కంటే వేగంగా ఐఐటీ కేంద్రంగా కొత్త స్టార్టప్‌లు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఐఐఎస్‌సీ గతంలోనే వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పనిచేసేలా వాతవరణ మార్పులపై ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇదే తరహాలో ఇంధనం, నీటి సమస్యల పరిష్కారానికీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే విమానాల కోసమూ ప్రత్యేక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్‌లోనూ 2014లో కంబషన్‌ (ఇంధనం మండే ప్రక్రియ)పై మొదలుపెట్టి.. నానో మెటీరియల్స్, కంప్యూటేషనల్‌ బ్రెయిన్‌ రీసెర్చ్, బయోలాజికల్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్, డేటా సైన్సెస్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరిన్ని కేంద్రాల ఏర్పాటు ఆలోచనలతో ముందుకొచ్చిన వారికి
రూ. 2 కోట్ల నగదు బహుమతి కూడా ఇస్తోంది.

ముందు వరుసలో ఐఐటీ బాంబే...
ఐఐటీ బాంబే 2017లో తొలిసారి ఖగోళ శాస్త్రంలో కోర్సును ప్రారంభించింది. ఇదే సంస్థలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివి విదేశాల్లో ఖగోళశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన వరుణ్‌ భలేరావును చదువు చెప్పేందుకు ఎంపిక చేసుకుంది. ఏడాది తిరిగేలోగా మరో నలుగురు మాజీ ఐఐటీయన్లు ఆయనకు జతకూడారు. వేర్వేరు అంశాల్లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వీరు ఇప్పుడు ఖగోళశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేస్తున్నారు. లడాఖ్‌లోని 18 ఏళ్ల పురాతన ఆప్టికల్‌ టెలిస్కోప్‌ దానంతట అదే పనిచేసేలా సరికొత్త ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను వారు రూపొందిస్తున్నారు. అంతేకాదు... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలసి గురుత్వ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలూ చేపట్టారు. భలేరావు మాదిరిగానే.. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ చదివిన అనూష్‌ కపాడియా.. ఇప్పుడు ఐఐటీ బాంబేలో సామాజిక శాస్త్రాల్లో విద్య నేర్పుతున్నారు.

ఐఐటీ, ఐఐఎస్‌సీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న వినూత్న పరిశోధనల్లో కొన్ని...
► మానవ మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్‌ల తయారీపై ఐఐటీ ఢిల్లీలో మనన్‌ సూరీ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తున్నారు. అతితక్కువ ఖర్చుతో సమాచారాన్ని దీర్ఘకాలంపాటు నిల్వ చేసుకోగల మెమరీని అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలపై ఫ్రాన్స్‌లో పీహెచ్‌డీ చేసిన మనన్‌ సూరికి మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) గతేడాది 35 ఏళ్ల వయసులోపు ఉన్న అద్భుత శాస్త్రవేత్తగా అవార్డు అందించింది.

► జల విద్యుత్‌ తయారీలో కీలకమైన టర్బైన్లను ప్రస్తుత పరిమాణంకంటే పదిరెట్లు తక్కువ సైజులో, అది కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కార్బన్‌ డయాక్సైడ్‌తో పనిచేయించేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2012లో బెంగళూరులోని ఐఐఎస్‌సీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన ప్రమోద్‌ కుమార్‌ కార్బన్‌ డయాక్సైడ్‌ను ఒక ప్రత్యేక స్థితికి తీసుకెళ్లడం ద్వారా టర్బయిన్లలో వాడుకోవచ్చునని అంటున్నారు. ద్రవ, వాయు స్థితులకు మధ్యలో ఉండే ఈ ప్రత్యేక స్థితిలో కార్బన్‌ డయాక్సైడ్‌ను వాడినప్పుడు తక్కువ సైజున్న టర్బయిన్లతోనే సమర్థంగా విద్యుదుత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ టర్బయిన్‌ సంప్రదాయేతర ఇంధన వనరులతోపాటు అణు రియాక్టర్లలోనూ అత్యంత కీలక పాత్ర పోషించనుందని అంచనా.

► 2007లో ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడైన నిషాంత్‌ డోంగరి ప్రస్తుతం హైదరాబాద్‌ ఐఐటీలో పనిచేస్తూ క్షిపణి రక్షణ వ్యవస్థలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే వినూత్న సౌరశక్తి పరికరాల తయారీతోపాటు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్ల సమర్థ వినియోగం వంటి అంశాల్లో సేవలందించేందుకు ‘ప్యూరెనర్జీ’ పేరుతో కంపెనీ స్థాపించారు.

► స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ వేగాన్ని పదుల రెట్లు ఎక్కువ చేసే 5జీ టెక్నాలజీకి తగిన ప్రమాణాలను రూపొందించే విషయంలో ఐఐటీ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కూచి కిరణ్‌ విజయం సాధించారు. గతేడాదే ఈ టెక్నాలజీపై పేటెంట్‌కు కిరణ్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు.


— సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు