ఈ అత్యాధునిక ఆస్పత్రి వెనక ఓ విషాదం

5 Feb, 2019 12:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓ అద్భుతం వెనక ఓ విషాధః దాగి ఉంటుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటుంటారు. అలాగే గుజరాత్‌లో అహ్మదాబాద్‌ నగరంలో ఇటీవల ఓ అద్భుతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అత్యాధునిక వసతులతో 17 అంతస్తుల అద్భుత ఆస్పత్రి భవనాన్ని ఆయన జనవరి 18వ తేదీన ప్రారంభించారు. ఎయిర్‌ అంబులెన్స్‌ సర్వీసుల కోసం మేడ మీద హెలిప్యాడ్‌ కలిగిన ‘సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌లో ప్రపంచ స్థాయి వసతులను ఏర్పాటు చేశారు. 1500 బెడ్లు కలిగిన ఈ ఆస్పత్రిలో కాగితరహిత సంపూర్ణ కంప్యూటర్‌ వ్యవస్థను నెలకొల్పారు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా ఇటీవల సాంఘిక మాద్యమాల్లో విస్త్రతంగా చక్కెర్లు కొట్టాయి.

ఇందులో జనరల్, ఎగ్జిక్యూటివ్‌ అనే రెండు కేటగిరీల కింద వైద్య సేవలు అందిస్తారు. జనరల్‌ కేటగిరీ కింద అవుట్‌ పేషంట్లకు యాభై రూపాయల నుంచి 150 రూపాయల వరకు చార్జి వసూలు చేస్తారు. ఇక ఆపరేషన్‌ చార్జీలు మూడువేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీ కింద అవుట్‌ పేషంట్లకు వంద నుంచి మూడు వందల రూపాయల వరకు, ఆపరేషన్లకు పది వేల నుంచి యాభైవేల రూపాయల వరకు చార్జీలు వసూలు చేస్తారు. మందులకయ్యే ఖర్చు రోగులే పూర్తిగా భరించాలి. ఈ ఆస్పత్రిని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన మెడికల్‌ ట్రస్టు నిర్వహిస్తోంది.

అ అత్యాధునిక ఆస్పత్రి పక్కనే ఇదే మెడికల్‌ ట్రస్టు, ట్రస్టీల ఆధ్వర్యంలో 1931లో స్థాపించిన ‘వాడిలాల్‌ సారాభాయ్‌ జనరల్‌ హాస్పటల్‌ అండ్‌ చినాయ్‌ మేటర్నిటీ హోం’ నడుస్తోంది. 1155 పడకలు కలిగిన ఈ ఆస్పత్రిని నాటి నగర మేయర్‌గా పనిచేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సిఫార్సు మేరకు మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించగా సారాభాయ్, చినాయ్‌ కుటుంబాలు ఆస్పత్రిని నిర్మించాయి. ప్రస్తుతం ఆస్పత్రి నిర్వహణకయ్యే ఖర్చులను మున్సిపాలిటీయే భరిస్తోంది. ఆస్పత్రి నిర్వహణకు తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీ ఉంది. ఇందులో సారాభాయ్, చినాయ్‌ కుటుంబాల వారసుల నుంచి నలుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అహ్మదాబాద్‌ మున్సిపాలిటీ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్సిపాలిటీ పాలక పక్షం నుంచి నలుగురు కార్పొరేటర్లు, ప్రతిపక్షం నుంచి ఒక కార్పొరేటర్‌ ప్రాతినిధ్యం వహించాలి. మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది కనుక ప్రతిపక్ష కార్పొరేటర్‌ మద్దతు కీలకంగా మారింది. దీంతో 2012 సంవత్సరం నుంచి పాలకపక్ష బీజేపీ నుంచే ఐదుగురు కార్పొరేటర్లు కమిటీకి సభ్యులుగా ఉంటున్నారు. ప్రతిపక్ష కార్పొరేటర్‌ స్థానాన్ని తొలగించారు. అప్పటి నుంచి కమిటీలో కార్పొరేటర్లదే పైచేయిగా మారి చారిటీ కుటుంబాల సభ్యుల పాత్ర నామమాత్రంగా మారిపోయింది.

అత్యాధునిక హంగులతో కొత్త ఆస్పత్రిని నిర్మిస్తున్న కారణంగా సారాభాయ్‌ ఆస్పత్రిలోని పడకలను 1155 నుంచి 200 పడకలకు కుదించాలని 2013లో నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అంతటితో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిన కమిటీ గత డిసెంబర్‌ నెలలో ఐదు వందల పడకలకు కుదించాలని తీర్మానించింది. ఆస్పత్రి ఆవరణలోనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఎల్‌ వైద్య కళాశాల పనిచేస్తోంది. ఈ ఆస్పత్రిలో ప్రతివిభాగానికి కళాశాలకు చెందిన ప్రొఫెసర్‌ అధిపతిగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, రెసిడెంట్లు పనిచేస్తున్నారు. ఒక్క ప్రొఫెసర్లను మినహాయించి మిగతా అందరిలో ఎక్కువ మందిని మున్సిపాలిటీ మెడికల్‌ ట్రస్ట్‌ కొత్త ఆస్పత్రికి బదిలీ చేసింది.

పడకలు పోయి, వైద్యులు పోవడంతో సారాభాయ్‌ ఆస్పత్రిని నమ్ముకున్న రోగులు విలపిస్తున్నారు. కొత్తా ఆస్పత్రికి పోవచ్చుగదా! అంటే అంత సొమ్ము తమకు ఎక్కడిదని పేద రోగులు బోరుమంటున్నారు. సారాభాయ్‌ ఆస్పత్రిలో పేద ఔట్‌ పేషంట్లకు ఉచిత వైద్యం. ఆపరేషన్లకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తారు. మందులు ఉచితం. ఈ ఆస్పత్రికి నెలకు సరాసరి 60 వేల మంది ఔట్‌ పేషంట్లు, ఆరువేల ఇన్‌పేషంట్లు వస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఏం కావాలన్నది ప్రశ్న.


ఇదే ప్రశ్నను డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కుల్దీప్‌ ఆర్య ముందు మీడియా ప్రస్తావించగా, సారాభాయ్‌ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, 20 నుంచి 25 శాతం తక్కువకు కొత్త ఆస్పత్రి కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని, అంతమాత్రం డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కొత్త ఆస్పత్రిని నిర్మించడం మంచిదేగానీ దాని కోసం ఉన్న ఆస్పత్రిని నాశనం చేయడం ఎందుకని సారాభాయ్‌ ఆస్పత్రి నిర్వహణ కమిటీలో సభ్యులైన బ్రిజేష్‌ భాయ్‌ చినాయ్, రూపా చినాయ్‌ విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆస్పత్రి పాతదిగా కనిపిస్తోందని, నిర్మాణం మాత్రం ఇప్పటికీ పటిష్టంగానే ఉందని వారు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం వెనక పెద్ద కుట్రే ఉందని, న్యాయం కోసం పేదల తరఫున కోర్టుకు వెళతామని వారంటున్నారు. గుజరాత్‌లోని దహోద్‌ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రిని ‘ప్రభుత్వం–ప్రైవేటు భాగస్వామ్యం’ కింద ఫార్మాస్యూటికల్‌ కంపెనీ జైడస్‌ కెడిల్లాకు 2017, అక్టోబర్‌లో అప్పగించారు. అప్పటి నుంచి అక్కడ పేదలకు ఉచిత వైద్యం కరవైంది. అదే తరహాలో అన్ని హంగులతో నిర్మించిన కొత్త ఆస్పత్రిని కూడా కార్పొరేట్‌ కంపెనీకి అప్పగించవచ్చని చినాయ్‌ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు