32 రూపాయలొస్తే.. పేదలు కానట్లే!!

7 Jul, 2014 13:26 IST|Sakshi
32 రూపాయలొస్తే.. పేదలు కానట్లే!!

పేదరికం ప్రమాణాలు మారిపోతున్నాయి. గ్రామాల్లో రోజుకు 32 రూపాయలు, నగరాల్లో 47 రూపాయల కంటే ఎక్కువగా ఖర్చుపెట్టేవాళ్లెవరినీ పేదల కింద లెక్క వేయక్కర్లేదని కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ ఒకటి సూచించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది పెద్ద దుమారాన్నే లేపేలా ఉంది. ప్రతిపక్షాలతో పాటు అధికారపక్షానికి చెందినవాళ్లు, సాక్షాత్తు కేంద్ర మంత్రులు కూడా ఈ పేదరికం లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, దీన్ని తాను తగిన స్థాయిలో లేవనెత్తుతానని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు.

రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రంగరాజన్ నేతృత్వంలోని ఓ కమిటీ ఈ పేదరికం అంచనాలను రూపొందించింది. ఈ లెక్కప్రకారం చూస్తే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పేదవారు. ఇంతకుముందు 2011 సంవత్సరంలో అయితే గ్రామాల్లో రూ. 27, నగరాల్లో రూ. 33 కంటే ఎక్కువ ఖర్చుపెట్టేవాళ్లు పేదలు కారని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆ మొత్తం కొంత పెరిగిందన్నమాట. పేదలు కానివాళ్లంతా తమ ఆహారానికి, విద్యకు, ఆరోగ్యానికి తగినంత సంపద కలిగి ఉంటారని చెబుతున్నారు. అంటే.. భవిష్యత్తులో అలాంటివాళ్లకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాలను వీరికి వర్తింపజేయక్కర్లేదని కూడా ప్రభుత్వాలు చెప్పే అవకాశం ఉంది. సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి, సమాజ్వాదీ పార్టీ నాయకుడు నరేష్ అగర్వాల్ కూడా ఈ లెక్కలను ఖండించారు. రంగరాజన్కు తాము రోజుకు వంద రూపాయలు ఇచ్చి, పల్లెలో ఎలా బతకాలో చూపించమంటామని అగర్వాల్ అన్నారు.

మరిన్ని వార్తలు