ప్రయాణికులు కూడా తాగకూడదా?

17 Aug, 2017 14:51 IST|Sakshi
ప్రయాణికులు కూడా తాగకూడదా?

తిరువనంతపురం: వాహనాల డ్రైవర్లు హాల్కహాల్, డ్రగ్స్‌ తీసుకొని, సిగరెట్‌ తాగుతూ వాహనాలు నడపరాదని, ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూన్‌ 23, 2017వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌పై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా క్యాబ్‌ డ్రైవర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. తామైతే హాల్కహాల్, డ్రగ్స్‌ తీసుకోకుండా, సిగరెట్‌ తాగకుండా కార్లను నడపగలమని, తాగిన ప్రయాణికులను ఎలా ఎక్కించుకోకుండా ఉంటామని వారు ప్రశ్నిస్తున్నారు. బార్లు, క్లబ్‌లు, పబ్‌లకు వచ్చే వారు ఎక్కువగా క్యాబ్‌లు బుక్‌ చేసుకుంటారని, వారిని కాదంటే తమకు గిరాకీ ఎలా ఉంటుందని కేరళ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపరాదనే నిబంధన అమల్లో ఉన్నప్పుడు, మద్యం సేవించిన ప్రయాణికులను కూడా తీసుకెళ్లొద్దంటే బార్లు, క్లబ్‌లకు వెళ్లే కస్టమర్లు ఇంటికెలా వెళతారని క్యాబ్‌ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కేరళ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ రాజీవ్‌ పుతాలత్‌ దష్టికి మీడియా తీసుకెళ్లగా, ప్రయాణికుల విషయంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ చెల్లదని చెప్పారు. మద్యం సేవించిన ప్రయాణికులను కూడా క్యాబుల్లో తీసుకెళ్లరాదనుకుంటే 1998 నాటి మోటార్‌ వాహనాల చట్టంలో మార్పులు తీసుకరావాల్సిందేనని, గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఇంతటి నిర్ణయాన్ని అమల్లోకి తీసుకరాలేమని ఆయన వివరించారు.

మోటార్‌ వాహనాల చట్టంలోని 185వ సెక్షన్, 13వ అధ్యాయం ప్రకారం మొదటి సారి మద్యం తాగి డ్రైవర్‌ పట్టుపడితే జరిమానాను రెండు వేల రూపాయల వరకు, జైలు శిక్షను ఆరు నెలల వరకు పొడిగించవచ్చని లేదా రెండూ విధించవచ్చని ఆయన తెలిపారు. మొదటిసారి నేరం చేసిన మూడేళ్లలోపు మళ్లీ మద్యం సేవించి పట్టుబడితే మూడు వేల రూపాయల వరకు జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష పొడిగించవచ్చని లేదా రెండూ విధించవచ్చని చెప్పారు. డ్రైవర్‌ శరీరంలో 100 ఎంఎల్‌ రక్తంలో 30 ఎంజీకి మించి హాల్కహాల్‌ ఉండరాదని పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ గురించి తెలిసి తాను కూడా ఆందోళన చెందానని, తాగిన ప్రయాణికులను గుర్తించడం, వారిలో ఎవరూ క్యాబ్‌ను బుక్‌ చేశారో తెలుసుకోవడం కూడా కష్టమేనని, ఇప్పుడు రాజీవ్‌ వివరణతో గందరగోళం తొలగిపోయిందని ఎర్నాకులంలోని జాయింట్‌ ప్రాంతీయ రవాణాధికారి కేఎల్‌ ఫ్రాంక్లిన్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు