రాహుల్‌ టీమ్‌లో ఎవరెవరు?

12 Dec, 2017 03:30 IST|Sakshi

యువనేతలకు ఏఐసీసీలో కీలక పదవులు కట్టబెట్టే అవకాశం

సచిన్‌ పైలట్, సుస్మితాదేవ్, జ్యోతిరాదిత్య తదితరులకు ప్రాధాన్యం!  

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఘట్టం పూర్తయ్యింది. అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ముళ్లపల్లి రామచంద్రన్‌ సోమవారం ప్రకటించారు.  పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా, సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు స్వీకరించబోతుండటంతో రాహుల్‌ ఎన్నికపై ఎలాంటి విమర్శలూ రాలేదు. గతంలో పార్టీ విధివిధానాలకు సంబంధించి రాహుల్‌ ఎన్నో సూచనలు చేసినా వాటిని పరిగణనలోనికి తీసుకున్నది తక్కువే. అందుకు కారణం వివిధ రాష్ట్రాల్లో ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్న వారిలో ఎక్కువ మంది సీనియర్లే కావడం.

అయితే ఇప్పుడు అధ్యక్షుడిగా తన ఆలోచనలనే అమలు చేసే అవకాశం రాహుల్‌కు ఉంటుంది. అందుకు రాహుల్‌ తనదైన బృందాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా ఆయన ఇప్పటికే కసరత్తు చేసినట్టు ఏఐసీసీలోని ఓ కీలక నేత ‘సాక్షి’కి తెలిపారు. ‘మాటల్లో కంటే చేతల్లో చూపడాన్నే రాహుల్‌ ఇష్టపడతారు. తన సహచరులు కూడా మెరుగైన పనితీరును కనబరచాలని ఆయన కోరుకుంటారు. ఆయన బృందం కూడా అలాగే ఉండబోతోంది’ అని ఆ నేత పేర్కొన్నారు. ‘సీనియర్ల నుంచి సలహాలను తీసుకుంటారు. అంత సులువుగా వారిని పక్కకు పెట్టరు. అయితే యుద్ధక్షేత్రంలో యువతరమే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు’ అని మరో యువ నేత పేర్కొన్నారు.

ఇప్పటికే యువతకు అవకాశం
శాసనసభ, సాధారణ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడం కోసం పార్టీలో ప్రతిభ కనబరుస్తున్న యువనాయకులను ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు పంపించారు. అలాగే సచిన్‌ పైలట్‌ వంటి యువకులు పీసీసీ అధ్యక్షులుగా ఉండటంలో రాహుల్‌ పాత్ర ఉంది. ప్రజా సమస్యలపై అనునిత్యం లోక్‌సభలో గొంతెత్తే సుస్మితాదేవ్‌ ప్రస్తుతం మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ తరపున లోక్‌సభలో ఆందోళన జరుగుతుంటే కొందరు సీనియర్లు వారి స్థానాలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి ఉండరాదని రాహుల్‌ భావిస్తున్నట్టు ఓ మాజీ ఎంపీ తెలిపారు.

యువ నేతల్లో దూకుడుగా ఉండే జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్, దీపేందర్‌హుడా, గౌరవ్‌ గొగోయ్, సుస్మితాదేవ్, రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, మీనాక్షి నటరాజన్‌ తదితరులకు ఏఐసీసీలో కీలక పదవులు దక్కే వీలుంది. ప్రస్తుతం ఉన్న రాహుల్‌ టీమ్‌లో ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు కీలకపాత్ర పోషిస్తుండగా మున్ముం దు కూడా ఆయన అంతే కీలకం కానున్నారు. ఇప్పటివరకున్న ప్రధాన కార్యదర్శులందరినీ తప్పించి చురుగ్గా ఉండే నేతలకు అవకాశమిచ్చి ఎన్నికలకు నూతనోత్సాహంతో వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ చీఫ్‌గా రాహుల్‌
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ(47) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల విభాగం చీఫ్‌ ముళ్లపల్లి రామచంద్రన్‌ ప్రకటించారు. ఈ నెల 16న రాహుల్‌  పార్టీ పగ్గాలు అందుకుంటారన్నారు. రాహుల్‌ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ దాఖలైన 89 నామినేషన్లు నిబంధనల మేరకు ఉన్నట్లు వెల్లడించారు. 2013లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా 19 ఏళ్లుగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి రాహుల్‌ పార్టీ పగ్గాలు స్వీకరిస్తారు. కాంగ్రెస్‌ చీఫ్‌గా ఎన్నికైన రాహుల్‌ గాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు