భారతీయ విద్యార్థి సృష్టి

23 Jul, 2018 23:19 IST|Sakshi

సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెల్లువెత్తుతున్న నకిలీ వార్తల వల్ల కలుగుతున్న నష్టాలేమిటో అందరికీ తెలిసిందే.  ఫేస్‌బుక్‌లోనో లేదా ట్విట్టర్‌లోనో వచ్చిన వార్త నిజమో కాదో తెలుసుకునే అవకాశం ఇంత వరకు లేకపోవడం వల్ల ఆ వార్తలను నిజమని నమ్మిన కొందరు భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు అసలీనా నకిలీనా అన్ని నిగ్గుతేల్చే సాంతికేక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. బ్రిటన్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్న భారత సంతతికి చెందిన లిరిక్‌ జైన్‌ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్త నిజమైనదో కాదో నిర్థారించే పరిజ్ఞానాన్ని అభివద్ధి చేశాడు.

ఈ పరిజ్ఞానం(ఫ్లాట్‌ఫాం) సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను వడబోసి నిజమైన వార్తలను నిర్థారిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా కథనం లేదా సమాచారం రాగానే ఈ ఫ్లాట్‌ఫాం 70వేలకు పైగా డొమైన్ల నుంచి వాటికి సంబంధించిన కథనాల్ని సేకరిస్తుంది. ప్రతి కథనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఆ కథనం హేతుబద్ధంగా ఉందా... దాని వెనుక రాజకీయ ప్రయోజనాలేమైనా ఉన్నాయా? కథనంలో ఇచ్చిన గణాంకాలన్నీ సరైనవేనా? అన్నది పరిశీలించి ఆ వివరాలను బహిర్గతం చేస్తుంది. దానిని బట్టి వినియోగదారుడు ఆ కథనం నమ్మదగినదో కాదో నిర్థారించుకుంటాడు.

ఈ పరిజ్ఞానం  ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని,వచ్చే సెప్టెంబర్‌లో అమెరికా, బ్రిటన్‌లలో అందుబాటులోకి వస్తుందని లిరక్‌ జైన్‌ తెలిపారు. అక్టోబర్‌లో ఈ పరిజ్ఞానం భారత్‌లో ప్రవేశపెడతామని ఆయన అంటున్నారు.వార్తలు, కథనాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కత్రిమ మేథను కూడా ఉపయోగించుకుంటామని జైన్‌ చెప్పారు. భారత దేశంలో 20 కోట్ల మందికిపైగా వాట్సాప్‌ వినియోగదారులున్నారు.ఇటీవల వాట్సాప్‌లో వస్తున్న అసత్య ప్రచారాలు, నకిలీ కథనాలు అల్లర్లకు, హత్యలకు దారితీస్తున్నాయి. ‘వాట్సాప్‌లో వస్తున్న కథనాలు, వార్తలు ఉద్రేకపూరితంగా, భావోద్వేగాలను రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో  ప్రభుత్వం ఆ కథనాలు అసలైనవో కాదో తెలుసుకోవడానికి, అవాస్తవ కథనాలను నియంత్రించడానికి చాలా సమయం పడుతోంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ లోపాన్ని అధిగమించడం కోసం సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని అప్పటి కప్పుడే వడపోసే అవకాశాల కోసం మేం అన్వేషిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో దీనికి సంబంధించిన మా ప్రణాళికల్ని ప్రకటిస్తాం’ అని జైన్‌ అంటున్నారు.

మైసూరు నుంచి కేంబ్రిడ్జి వరకు..
మైసూరు చెందిన 21 ఏళ్ల లిరిక్‌ జైన్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. గత ఏడాది లాజిక్‌  అలే పేరుతో ఒక స్టార్టప్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. బ్రిటన్‌లో మొట్టమొదటి ఇంటెలిజెంట్‌ న్యూస్‌ ఫీడ్‌ కంపెనీ ఇదే. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను గుర్తించడం దీని పని. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ,బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన నిపుణులతో 10లక్షల పౌండ్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు. బ్రిటన్,అమెరికా, భారత్‌లలో ప్రస్తుతం ఈ కంపెనీకి 38 మంది సిబ్బంది ఉన్నారు. త్వరలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని ఆలోచిస్తున్నట్టు జైన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు