లోకల్ రైళ్లకు కొత్త టైంటేబుల్

13 Nov, 2014 23:18 IST|Sakshi

 సాక్షి, ముంబై: ప్రయాణికుల సౌకర్యార్థం సెంట్రల్ రైల్వే శనివారం నుంచి లోకల్ రైళ్ల కొత్త టైం టేబుల్ అమలులోకి తెస్తోంది. దీని వల్ల  కొందరికి ఇబ్బంది కాగా, మరికొందరికి మరింత సౌకర్యవంతం కానుంది. ముఖ్యంగా ఆఖరు లోకలు, మొదటి లోకల్ రైలు సమయంలో మార్పులు చేయడంవల్ల కొందరు ఉద్యోగులు, వ్యాపారులకు మేలు జరగ్గా, మరికొందరికి అన్యాయం జరగనుంది. సెంట్రల్ రైల్వే మార్గంలో కొంత కాలం నుంచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ముఖ్యంగా దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు, కొత్తగా ప్రవేశపెట్టిన లోకల్ రైళ్ల రాకపోకలు, కొన్ని రైళ్లను విస్తరించడం, అదనంగా ట్రిప్పులు పెంచడం తదితర చర్యల వల్ల రైల్వే మార్గంపై అదనపు భారం పడుతోంది. దీంతో టైం టేబుల్ ప్రకారం రైళ్లను నడపడం పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా లోకల్ రైళ్లపై ప్రయాణికుల నుంచి కూడా అనేక సూచనలు, సలహాలు వచ్చాయి.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఏ సమయంలో, ఎక్కడికి, ఎన్ని లోకల్ రైళ్లను నడిపితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందనే దానిపై రైల్వే అధికారులు అధ్యయనం చేశారు. ఆ తర్వాత కొత్త టైం టేబుల్ రూపొంధించారు. ఆ ప్రకారం ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి అర్ధరాత్రి 12.38 గంటలకు బయలుదేరే ఆఖరు లోకల్ రైలు శనివారం నుంచి 12.30 గంటలకు బయలుదేరుతుంది. ఎనిమిది నిమిషాలు ముందు వెళ్లడంవల్ల ఉద్యోగులు, వ్యాపారులు పరుగులు తీయాల్సి వస్తుంది. లేదంటే రైలు అందకుండా పోయే ప్రమాదం ఉంది.

అదేవిధంగా సీఎస్టీ నుంచి తెల్లవారు జాము 4.05 గంటలకు బయలుదేరే మొదటి లోకల్ రైలు శనివారం నుంచి 4.12 గంటలకు బయలుదేరుతుంది. ఏడు నిమిషాలు ఆలస్యంగా బయలు దేరడంవల్ల ప్రయాణికులకు కొంత మేలు జరగనుంది. వీటితోపాటు రోజంతా పరుగులు తీసే రైళ్ల సమయంలో అనేక మార్పులు జరిగాయి. కాగా హార్బర్, ట్రాన్స్ హార్బర్ మార్గంలో రైళ్ల టైం టేబుల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు