పైసా వసూల్‌..!

21 Feb, 2018 01:15 IST|Sakshi

ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీ

ఎంఆర్‌పీని పెంచి ధరలు ముద్రించేలా తయారీదారులపై ఒత్తిళ్లు

ఢిల్లీలోని నాలుగు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రుల

బిల్లుల పరిశీలనలో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీని, నయా మెడికల్‌ మాఫియాను కళ్లకు గట్టే అధ్యయనమొకటి తాజాగా వెలుగుచూసింది. ఔషధాలు, వైద్య పరీక్షలు, డిస్పోజబుల్స్‌.. మొదలైనవాటిపై వందో, రెండొందలో కాదు.. దాదాపు 1700 శాతం లాభంగా పొందుతున్నట్లు ఇందులో తేలింది. ఉదాహరణకు 2 మి.లీ అడ్రెనార్‌ ఇంజెక్షన్‌ ఎంఆర్‌పీ రూ.189.95. కానీ బల్క్‌ ఆర్డర్లలో భాగంగా అది అసుపత్రులకు రూ. 14.70కే అందుతుంది.

ఆ ఇంజెక్షన్‌కు ఆసుపత్రులు వసూలు చేస్తోంది ఎంతో తెలుసా?.. అక్షరాలా  5,318 రూపాయలు. దేశరాజధాని ఢిల్లీలోని నాలుగు ప్రముఖ ఆసుపత్రుల్లో ఔషధ ధరల నిర్ధారణ సంస్థ(నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ– ఎన్‌పీపీఏ) జరిపిన పరిశీలనలో ఇలాంటి నిలువు దోపిడీ విధానాలెన్నో బయటపడ్డాయి. ఈ దోపిడీలో ఫార్మా కంపెనీల కన్నా ఆసుపత్రులే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయి.

అంతేకాకుండా, బల్క్‌ ఆర్డర్లు ఇస్తున్నాం కనుక.. గరిష్ట చిల్లర ధర(ఎమ్‌ఆర్పీ)ని అధికంగా ముద్రించాలంటూ ఔషధ తయారీ కంపెనీలపై ఆసుపత్రులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కూడా తేలింది. ఆసుపత్రుల బిల్లులు అధికంగా ఉన్నాయంటూ ఇటీవల డెంగ్యూ, ఇతర వ్యాధులతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు వరస ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈ పరిశీలన చేపట్టారు.

ఎన్‌పీపీఏ పరిశీలనలో తేలిన ముఖ్యాంశాలు
రోగుల బిల్లులో సుమారు సగ భాగం అయిన ఔషధాలు, డిస్పోజబుల్స్, వైద్య పరీక్షల వల్ల అధికంగా ప్రయోజనం పొందుతోంది వాటి తయారీదారులు కాదు..ప్రైవేట్‌ ఆసుపత్రులే.
 అత్యవసర, ప్రాణాపాయ రక్తపోటు చికిత్సలో వినియోగించే ఔషధాలపై సేకరించిన ధరలో రూ. 1,192 మేర మార్జిన్లు ఆర్జిస్తున్నాయి.
 టుడేసెఫ్‌ 1 గ్రామ్‌ ఇంజక్షన్‌కు రోగుల నుంచి రూ.860 వసూలు చేస్తుండగా, ఆసుపత్రులు కేవలం రూ. 40.32కే పొందుతున్నాయి. అంటే ఇక్కడ లాభం మార్జిన్‌ సుమారు 966 శాతం.
 స్టాప్‌కాక్, బీఐ వాల్వ్, జీఎస్‌–3040 లాంటి డిస్పోజబుల్‌ పరికరాలను రూ.5.77కే కొనుగోలు చేస్తూ 1700 శాతం లాభం పొందుతున్నాయి.
 ధరల నియంత్రణలోకి రాని ఔషధాలపై 160 నుంచి 1200 శాతం, నియంత్రణలోని ఔషధాలపై 115 నుంచి 350 శాతం మేర లాభాలు.
 ఔషధాలపై అధిక ధరలు ముద్రించడం వల్ల ఆసుపత్రుల్లోని ఫార్మసీలు నిబంధనలు ఉల్లంఘించకుండానే అయాచిత లాభం పొందుతున్నాయి. వాటిని బయట కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభిస్తాయి కానీ ఆసుపత్రులు రోగులకు ఆ అవకాశం ఇవ్వట్లేదు.
 తమ లాభాలు పోను ఆసుపత్రుల ఒత్తిళ్ల మేరకు ఔషధాల ధరలను తయారీదారులు కృత్రిమంగా పెంచుతున్నారు. దీని వల్ల రోగుల జేబులకు చిల్లు పడుతుండగా, ఆసుపత్రులు అధిక ప్రయోజనం పొందుతున్నాయి.
 పడక అద్దె, బిల్లులో స్పష్టంగా కనిపించే ఇతరత్రా వ్యయాల మాదిరిగా.. ఔషధాలు, డయాగ్నస్టిక్స్, డిస్పోజబుల్స్‌కు అయ్యే ఖర్చును ఎస్టిమేట్, ప్యాకేజీలో ఆసుపత్రులు చూపడం లేదు.
 డిస్పోజబుల్స్‌పై నియంత్రణ చట్టం లేనందున వాటి ఖర్చు మొత్తం బిల్లులో పదో వంతు, షెడ్యూల్డ్‌ ఔషధాల కన్నా రెట్టింపు అవుతోంది.
 రాష్ట్ర చట్టాలకు లోబడి ఉండే వైద్య పరీక్షల వాటా మొత్తం బిల్లులో 15 శాతంగా ఉంటోంది.
వైద్యులు కూడా చవకైన షెడ్యూల్డ్‌ ఔషధాలను కాదని లాభాలు కురిపించే నాన్‌–షెడ్యూల్డ్‌ ఔషధాలనే సిఫార్సు చేస్తున్నారు.
 ఔషధాల ధరల కృత్రిమ పెంపు కేవలం ఈ నాలుగు ఆసుపత్రులకు పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఇదే తంతు నడుస్తోంది.  


2 మి.లీ. అడ్రెనార్‌ ఇంజక్షన్‌ ఆర్డర్‌ ధర - రూ. 14.70
ఎంఆర్‌పీ - రూ. 189.95
వసూలు చేసింది - రూ. 5,318
ఔషధాలు, డిస్పోజబుల్స్, వైద్య పరీక్షలపై లాభాలు - 1,700 శాతం

మరిన్ని వార్తలు