ఇక తదుపరి యుద్ధం వాయు కాలుష్యంపైనే..

8 Jun, 2020 18:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేయడంతో దేశంలో కాలుష్యం తగ్గిందని, పర్యవసానంగా ఈమధ్య ఎన్నడూ కనిపించని హిమాలయ పర్వతాలు 200 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌ నుంచి కనిపిస్తున్నాయని, కాశ్మీర్‌ అందాలు కూడా ఎన్నడూ లేనంతగా కనువిందు చేస్తున్నాయని, పదేళ్లకోసారి ఒకటి, రెండు కనించే అరుదైన పూలు నేడు వనమెల్లా కనిపిస్తున్నాయంటూ ఎంతో మంది ప్రజలు వాటి తాలూకా ఫొటోలను సోషల్‌ మీడియాలో తెగ పోస్ట్‌ చేస్తున్నారు. వారిలో గత 30 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోన్న సంత్‌ బల్బీర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. 

గాలిలో ధూళి కణాలు గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ స్థాయిలో ఉన్నాయని నాసాకు చెందిన టెర్రా శాటిలైట్‌ స్పష్టం చేసింది. కోవిడ్‌ పేరిట దొరికిన ఇంతటి అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకొని దక్షిణాసియా దేశాలు కలసి కట్టుగా వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతినబూనాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా దక్షిణాసియాలో ప్రతి ఏటా 50 లక్షల మంది మరణించారని, అది 2012 నుంచి మొత్తం దక్షిణాసియాలో మరణించిన వారి సంఖ్యలో 22 శాతమని ‘ది ఎనర్జీ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌’ అధ్యయనంలో తేలింది. ( కరోనా : మిజోరాం సర్కార్‌ అనూహ్య నిర్ణయం)

దక్షిణాసియా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కింద 1998లో వాయుకాలుష్య నియంత్రణకు తీసుకున్న మాలే డిక్లరేషన్‌ను పునరుద్ధరించాలని బింద్యా బన్‌బాలి ప్రధాని డిమాండ్‌ చేస్తున్నారు. ఆమె చైనా సహా ఎనిమిది హిమాలయ సానువు దేశాల సభ్యత్వం కలిగిన ‘ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటీగ్రేటెడ్‌ మౌంటేన్‌ డెవలప్‌మెంట్‌’ తరఫున వాయు కాలుష్యం నివారణకు కృషి చేశారు. 2002లో కుదిరిన ‘ఆసియాన్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రాన్స్‌బౌండరీ హాజ్‌ పొల్యూషన్‌’ నిక్కచ్చిగా అమలు చేయాలని పర్యావరణ వేత్తలు ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. 2014లో దీనిపై సభ్య దేశాలన్నీ సంతకాలు చేశాయి.

మరిన్ని వార్తలు