వచ్చేవారం లోక్‌సభ ముందుకు భూబిల్లు!

8 Aug, 2015 01:31 IST|Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పదమైన భూ సేకరణ సవరణ బిల్లు- 2015 వచ్చేవారం లోక్‌సభ ముందుకు రానుంది. 70 శాతం రైతుల అనుమతి తప్పనిసరి, సామాజిక ప్రభావ అంచనా... తదితర కీలకాంశాలపై ప్రభుత్వం వెనక్కితగ్గి యూపీఏ 2013లో తెచ్చిన చట్టంలో నిబంధనలను యథాతథంగా ఉంచడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీలోని 11 మంది బీజేపీ సభ్యులు మంగళవారం సవరణలు ప్రతిపాదించారు. ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో నివేదిక సమర్పించేందుకు 11వ తేదీ వరకు గడువు పొడిగించాలని కమిటీ కోరగా లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది.

10వ తేదీ ఉదయం సమావేశమై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికకు తుదిరూపు ఇవ్వనుంది. వచ్చేవారం పార్లమెంటు ముందుకు వచ్చే ముఖ్యమైన బిల్లుల్లో  భూ సేకరణ బిల్లు కూడా ఒకటని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ శుక్రవారం తెలిపారు. లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే పార్లమెంటరీ కమిటీ చేసిన సవరణలను కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. అంటే ఈనెల 11 లేదా 12వ తేదీన కేబినెట్ భేటీ జరగొచ్చు.

మరిన్ని వార్తలు