ఎన్నికల బరిలో భార్యా బాధితుల సంఘం నేత

3 Apr, 2019 13:33 IST|Sakshi

అహ్మదాబాద్‌ : ఎన్నికల బరిలో రాజకీయ నేతలే కాదు భిన్న రంగాలకు చెందిన వారూ తమ తలరాతను పరీక్షించుకుంటున్నారు. భార్యా బాధితుల సంఘం నేత సైతం గుజరాత్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగారు. ఎన్నికల్లో తాను గెలుపొందితే భార్యల చేతిలో వేధింపులు ఎదుర్కొంటున్న పురుషుల గొంతును చట్టసభలో వినిపిస్తానని ఆయన హామీలు గుప్పిస్తున్నారు.

అహ్మదాబాద్‌ ఈస్ట్‌ నుంచి అఖిల భారత భార్య వేధింపుల వ్యతిరేక సంఘాన్ని నడుపుతున్న దశరధ్‌ దేవ్డా మంగళవారం తన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. భార్యలు, అత్తింటి వేధింపులు ఎదుర్కొంటున్న మగవారి కోసం తన పోరాటం కొనసాగిస్తానని ఈ సందర్భంగా దేవ్డా పేర్కొన్నారు. కాగా గతంలో ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఇక దేవ్డా సంస్థలో 69,000 మంది సభ్యులున్నా గత ఎన్నికల్లో ఆయనకు గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 2300 ఓట్లు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 400 ఓట్లే పోలయ్యాయి. అయితే ఇతర అభ్యర్ధుల మాదిరిగా తాను ప్రచారంపై ఖర్చు చేయనని, ఇంటింటికీ తిరిగి పురుషులకూ సమాన హక్కులు కల్పిస్తానని వాగ్ధానం చేస్తానని చెప్పుకొచ్చారు. జాతీయ పురుషుల కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నది తన ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు.

మరిన్ని వార్తలు