ఆ నివేదికను ఎందుకు పట్టించుకోలేదు?

28 Sep, 2019 04:37 IST|Sakshi

‘పోలవరం’ పర్యావరణ, పునరావాసంలో నియమావళి ఉల్లంఘనలపై ఎన్జీటీ ధర్మాసనం

ఏం చర్యలు తీసుకున్నారని నిలదీత.. 

తదుపరి విచారణకు ప్రాజెక్టు అథారిటీ సీఈవో హాజరుకావాలని ఆదేశం  

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ముందే నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, కాఫర్‌ డ్యామ్‌ నిర్మించేటప్పుడు నియమావళిని పాటించకపోవడంపై పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ధర్మాసనం ప్రశ్నించింది. పర్యావరణ అనుమతుల్లో కూడా ఉల్లంఘనలు ఉన్నాయని ఉమ్మడి తనిఖీ ద్వారా వెలుగు చూసిందని పేర్కొంటూ... దీనిపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. ప్రాజెక్టుకు చెందిన వివిధ అంశాలపై డాక్టర్‌ పి.పుల్లారావు, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయెల్, జస్టిస్‌ వాంగ్డి, జస్టిస్‌ రామకృష్ణన్, డాక్టర్‌ నాగిన్‌ నందాతో కూడిన ఎన్జీటీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ శుక్రవారం విచారించింది. అక్రమ డంపింగ్, కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో ప్రణాళిక లేకపోవడం, తెలంగాణలోని భద్రాచలం, ఇతర ప్రాంతాలపై బ్యాక్‌ వాటర్‌ ప్రభావం తదితర అంశాలతో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, సీపీసీబీ, ఏపీపీసీబీ సమర్పించిన ఉమ్మడి తనిఖీ నివేదికను ఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది. ఉమ్మడి తనిఖీ కమిటీ చేసిన సిఫారసులను ప్రాజెక్ట్‌ నిర్వాహకులు పాటించలేదని అభిప్రాయపడింది. 

నవంబరు 7న తదుపరి విచారణ... 
ఉల్లంఘనలపై ప్రాజెక్ట్‌ నిర్వాహకులకు వ్యతిరేకంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏయే చర్యలు ప్రారంభించిందని జస్టిస్‌ వాంగ్డి ప్రశ్నించారు. అయితే వీటిపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, ఏపీ తరఫున హాజరైన న్యాయవాదులు సమయం కోరారు. నిబంధనల ఉల్లంఘనను ఉమ్మడి తనిఖీ కమిటీ ధ్రువీకరించినందున వారి అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ తరఫున ఉల్లంఘనలు, నిష్క్రియతను పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం నవంబర్‌ 7న అన్ని వివరాలతో హాజరుకావాలని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను ఎన్జీటీ ఆదేశించింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా