రోజుకు 50 వేల మందికే దర్శనం

14 Nov, 2017 02:40 IST|Sakshi

వైష్ణోదేవీ ఆలయ ప్రవేశంపై హరిత ట్రిబ్యునల్‌

న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సోమవారం ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. అలాగే బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని ఈ నెల 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్‌ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ట్రిబ్యునల్‌ చైర్మన్‌ స్వతంతర్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, ఆలయానికి చేరుకునే మార్గంలో 19 చోట్ల అగ్ని మాపక పరికరాలను ఏర్పాటుచేశారు. 

మరిన్ని వార్తలు