మాజీ డీజీపీకి రూ.46 లక్షల భారీ జరిమానా

28 Aug, 2018 09:29 IST|Sakshi

చెట్ల నరికివేతపై ఎన్జీటీ సీరియస్‌

రిజర్వు ఫారెస్టులో భూమి కొనుగోలుపై మండిపాటు

సాక్షి, న్యూఢిల్లీ : ఇంటి నిర్మాణం కోసం రిజర్వు ఫారెస్టులో స్థలం కొనుగోలు చేయడంతోపాటు విచక్షణారహితంగా చెట్లు నరికేయడంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మండిపడింది. బాధ్యత గల పదవిలో ఉండి చట్ట విరుద్ధంగా వ్యవహరించాడని మాజీ డీజీపీపై కొరడా జలిపించింది. అనుమతులు లేకుండా చెట్లు నరికేశారనీ రూ.46 లక్షల భారీ జరిమానా విధించింది. వివరాలు... ఉత్తరాఖండ్‌కు డీజీపీగా పనిచేస్తున్న కాలంలో బీఎస్‌ సిద్ధు ముస్సోరి రిజర్వు ఫారెస్టులో భూమి కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణం కోసం అందులో ఉన్న 25 సాల్‌ చెట్లను నరికేయించారు.

ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి రిజర్వు ఫారెస్టు ఏరియాలో భూమి కొనుగోలు చేయడంతో పాటు అనుమతులు లేకుండా చెట్లను తొలగించి పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కాడంటూ ఆయనపై ఎన్జీటీ బార్‌ అసోషియేషన్‌ ఫిర్యాదు చేసింది. పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ మాజీ పోలీస్‌ అధికారికి చట్టం గుర్తు చేసింది. నేల కొరిగిన మొత్తం చెట్ల ఖరీదుకు 10 రెట్లు చెల్లించాలని జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.రాథోర్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 1988 జాతీయ అటవీ విధానం, 1980 జాతీయ అడవుల పరిరక్షణ చట్టం ప్రకారం రిజర్వు ఫారెస్టులో భూమి కొనుగోలు అక్రమమని తేల్చిచెప్పింది.

మరిన్ని వార్తలు