ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ దత్తు

1 Mar, 2016 01:23 IST|Sakshi
ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ దత్తు

న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఆయన ఏడవ చైర్మన్. గత మేలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీకాలం ముగియడంతో, కమిషన్ సీనియర్ సభ్యుడైన జస్టిస్ సిరియక్ జోసెఫ్ ఇప్పటివరకు ఆపద్ధర్మ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక, ప్రామాణిక తీర్పులను జస్టిస్ దత్తు వెలువరించారు. కర్ణాటకలోని చిక్‌మగళూరులో డిసెంబర్ 3, 1950లో ఆయన జన్మించారు. బెంగళూరులో లా పూర్తి చేశారు. 1975లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1995లో కర్ణాటక హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2008లో సుప్రీంకోర్టుకు బదిలీ అయి, 2014, సెప్టెంబర్ 28న భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యారు. 2015, డిసెంబర్ 2న పదవీవిరమణ చేశారు.

మరిన్ని వార్తలు