యోగి ప్రభుత్వానికి నోటీసులు

10 Apr, 2018 18:42 IST|Sakshi
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (ఫైల్‌ ఫొటో)

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన ఉనావో లైంగిక దాడి కేసులో యోగి ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల సంఘం జారీ నోటీసులు చేసింది. అత్యాచార బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించి నివేదికను అందజేయాలని నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకునేలా హామీ ఇవ్వాలని కోరింది.

బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగర్‌‌, ఆయన సోదరుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఉనావో  ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయి ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమైన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎన్‌హెచ్చార్సీ హెచ్చరించింది. బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది.

నాలుగు వారాల గడువు ఇస్తున్నాం...
‘పోలీసు కస్టడీలో వ్యక్తి  మరణం, అందుకు దారితీసిన పరిస్థితుల గురించి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీకి ఉంటుంది. 24 గంటలు గడిచినా మాకు ఎటువంటి సమాచారం అందలేదు. బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఆస్పత్రిలో చేరడం, మరణించడం వరకు జరిగిన ప్రతీ అంశం గురించి పూర్తి సమాచారం అందజేయాలని, ఇందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నామని’ ఎన్‌హెచ్చార్సీ తెలిపింది.

బాధితురాలు తన కుటుంబంతో కలిసి ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న బాధితురాలి తండ్రిని పోలీసులు అదేరోజు రాత్రి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు లాఠీలతో తన తండ్రిని కొట్టి చంపారని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతస్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరిన్ని వార్తలు