పాక్‌ ఉగ్రవాది బహదూర్‌పై చార్జిషీట్‌

7 Jan, 2017 01:30 IST|Sakshi
పాక్‌ ఉగ్రవాది బహదూర్‌పై చార్జిషీట్‌

ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ: లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న పాకిస్థానీ జాతీయుడు బహదూర్‌ అలీ అలియాస్‌ సైఫుల్లా మన్సూర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు బహదూర్‌ అలీ కుట్ర పన్నాడని చార్జిషీట్‌లో పేర్కొంది. ఢిల్లీ జిల్లా జడ్జి అమర్‌నాథ్‌ ఎదుట ఈ మేరకు అభియోగపత్రాన్ని నమోదు చేసింది. అలీ మరో ఇద్దరు ఉగ్రవాదులు అబు సాద్, అబు దార్దాతో కలసి వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఏడు రోజులు ప్రయాణించి జూన్ 20న భారత్‌ చేరుకున్నాడని చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

జూన్  22న ఎన్ కౌంటర్‌లో అబు సాద్, అబు దర్దా మృతి చెందారని, దీంతో అలీ అక్కడి నుంచి తన మకాంను వేరే చోటికి మార్చాడని వెల్లడించింది. జూలై 24న అలీని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. లాహోర్‌లోని రైవిండ్‌ గ్రామానికి చెందిన బహదూర్‌ అలీ పాఠశాల విద్యను మధ్యలోనే విడిచిపెట్టారు. అరెస్ట్‌ సమయంలో అతని వద్ద జమ్మూకశ్మీర్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మ్యాప్‌లు లభించాయని ఎన్ఐఏ వెల్లడించింది.

మరిన్ని వార్తలు