నైజీరియన్పై దాడి, విదేశాంగ శాఖ సీరియస్

27 May, 2016 12:12 IST|Sakshi

హైదరాబాద్: జాతి విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే వాదనల నేపథ్యంలో నగరంలో నైజీరియాకు చెందిన ఓ యువకుడిపై దాడి జరిగింది. పార్కింగ్ కు ఖాళీ లేకుండా వాహనాన్ని అడ్డుపెట్టాడనే నెపంతో ఓ హైదరాబాదీ...నైజీరియన్ ను ఇనుపరాడ్డుతో చితక్కొట్టిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన విదేశాంగ మంత్రిత్వ శాఖ కేసుకు సంబంధించిన వివరాలను తమకు పంపాలని హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసింది.

బుధవారం జరిగిన ఈ దాడిలో నైజీరియా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విదేశీయులపై ఇటువంటి దారుణాలకు ఒడిగడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని కేంద్ర మంత్రి వీకే సింగ్ హెచ్చరించారు. ఈ విషయంపై ఆఫ్రికా రాయబారితో చర్చించినట్లు వివరించారు. ఆఫ్రికా జాతీయులపై దాడులు జాతి విద్వేషాలకి చెందినవి కావని చెప్పినట్లు తెలిపారు. వారి భద్రతకు భారత్ కట్టుబడి ఉన్నట్లు వివరించారు. ఆఫ్రికాలో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలనీ ముఖ్యంగా కాంగో లాంటి ప్రాంతాల్లో నివసించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఢిల్లీలో ఫ్రెంచ్ టీచర్ ఒలివర్ హత్యకు వ్యతిరేకంగా కాంగో వాసులు నినాదాలు చేస్తుండటంతో ఆయన అక్కడి భారతీయులకు భద్రతపై జాగ్రత్తపడాలని సూచించారు. ఒలివర్ హత్యకేసును విచారించిన పోలీసులు ఒలివర్ కు దుండగులకు మధ్య ఆటోలో గొడవ జరిగినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు