గర్భిణీలు, పాలిచ్చే తల్లులకే నైట్‌షెల్టర్లు

4 Jul, 2014 23:40 IST|Sakshi

ఆరోగ్యంగా ఉన్న వారి కోసం కాదన్న హైకోర్టు
న్యూఢిల్లీ: నైట్ షెల్టర్లను తమ శాశ్వత ఆవాసాలుగా ఏర్పరచుకున్న వారిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాశ్రయులైన గర్భిణీలు, పాలిచ్చే తల్లులకే వాటిలో ఆశ్రయం కల్పించాలని, ఆరోగ్యంగా ఉన్న వారి కోసం కాదని స్పష్టం చేసింది. నైట్‌షెల్టర్లను శాశ్వత ఆవాసాలుగా మార్చుకొనేందుకు వాటిని నిర్మించలేదని పేర్కొంది.

‘‘ఢిల్లీకి వచ్చే ప్రతి వారికి శాశ్వత నివాసం కల్పించడం ఎలా సాధ్యం? వాటిపై మీకు గుత్తాధిపత్యం ఎలా ఉంటుంది? ఈ నివాసాలు నిరాశ్రయులైన గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు మాత్రమే’’ అని జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీలో వేల సంఖ్యలో నిరాశ్రయులున్నారని, కేవలం అవసరమైన వారికి మాత్రమే నైట్‌షెల్టర్లలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపింది.
 
అవసరం తీరిన వారు నైట్‌షెల్టర్లను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సదుపాయాలు కల్పించాలంటూ హైకోర్టు గతం లో ఇచ్చిన ఆదేశాలపై స్పష్టతనివ్వాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అనేకులు సంవత్సరాలుగా ఈ నైట్‌షెల్టర్లలో నివాసం ఉంటున్నారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
 మోతియాఖాన్ నైట్‌షెల్టర్‌లో నివాసముంటున్న ప్రియా కాలే అంతకుముందు ఓ కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఆ శిబిరంలో అపరిశుభ్ర వాతావరణం కారణంగా తాను తన రెండు నెలల శిశువును కోల్పోయానని ఆమె పేర్కొన్నారు. నైట్ షెల్టర్లలో మెరుగైన జీవన, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆమె కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తలు