ఆప్‌ సర్కార్‌కు కేంద్రం షాక్‌

17 Apr, 2018 18:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది మంది ఢిల్లీ మంత్రుల సలహాదారులను తొలగించింది. ఈ పదవులు మంజూరు కాలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. తొలగించిన వారిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సలహాదారు కూడా ఉన్నారు. కేంద్రం హోంమంత్రిత్వ శాఖ సిఫార్సులతో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రికి ఆమోదించిన పోస్టుల్లో ఈ పదవులు లేవని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రభుత్వానికి లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పదవుల నియామకానికి సంబంధించి కేంద్రం నుంచి ముందస్తు అనుమతి కోరలేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వేటుపడిన సలహాదారుల్లో న్యాయమంత్రి మీడియా సలహాదారు అమర్‌దీప్‌ తివారి, డిప్యూటీ సీఎం మీడియా సలహాదారు అరుణోద్య ప్రకాష్‌, ఆర్థిక మంత్రి సలహాదారు రాఘవ్‌ చద్దా, డిప్యూటీ సీఎం మీడియా సలహాదారు అతిషి మర్లేనా ఉన్నారు. వీరికి గత మూడేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోంది. కేంద్రం చర్యను ఆప్‌ సర్కార్‌ తీవ్రంగా ఖండించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. 

మరిన్ని వార్తలు