ఆర్థిక ఆరోగ్యానికి నవ సూత్రాలు

12 Jul, 2014 23:42 IST|Sakshi

 ఆర్థిక పరిస్థితులు బాగుండాలన్నా, ఆర్థికంగా పురోగమించాలన్నా ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. ప్రణాళిక రూపొందించుకోవడమే కాదు..దాన్ని పాటించడమూ ముఖ్యమే. ఆర్థిక ప్రణాళికకు సంబంధించి కొన్ని ప్రాధమిక సూత్రాలు పాటించాలి.

 ఖర్చులు తగ్గించుకోవాలి: ఖర్చులెప్పుడూ ఆదాయానికన్నా తక్కువగానే ఉండాలన్నది ఒక బండగుర్తు. అయితే, ఇది చెప్పడం ఎంత సులువో .. ఆచరించడం అంత కష్టం. అయినా సరే అందుబాటులో ఉన్న పొదుపు మార్గాలను ప్రయత్నించి చూడాలి. ఆదాయాన్ని పెంచుకోవడం కష్టం కానీ.. కాస్త ప్రయత్నిస్తే ఖర్చులు తగ్గించుకోవడం సులువే. మరో విషయం.. ఉద్యోగంలో జీతానికి సంబంధించి కూడా మీ నైపుణ్యాలను సమీక్షించుకుని, ఉద్యోగ బాధ్యతలను బట్టి సదరు ఉద్యోగానికి ఎంత జీతం అందుకోవాలన్నది లెక్క వేసుకోవాలి. ఏడాదికి కనీసం వెయ్యి రూపాయలు తగ్గినా.. మీరు తక్కువ జీతానికి పనిచేస్తున్నట్లే.

 బడ్జెట్‌కి కట్టుబడి ఉండాలి: దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలియకపోతే.. పొదుపు లక్ష్యాలను సాధించలేం కదా. అందుకే, ఖర్చులపై నియంత్రణ సాధించేందుకు బడ్జెట్ అంటూ ఉండాలి. ఆదాయంలో నుంచి ముందుగా కొంత మొత్తం పొదుపునకు కేటాయించండి. మిగిలిన దాంట్లో తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులు, నిత్యావసరాల ఖర్చులు వంటివి చూసుకోవాలి. అప్పటికీ ఇంకా మిగిలితే అప్పుడు మిగతా లగ్జరీలవైపు చూడొచ్చు. చిన్న మొత్తమైనా అసలు పొదుపు చేయడం అన్నది ముఖ్యం. ఎంత త్వరగా ప్రారంభిస్తే.. అంత సంపద సమకూరుతుంది.

 క్రెడిట్ కార్డు వాడకం తగ్గాలి: ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే ప్రధాన అడ్డంకులు క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలు, పేరుకుపోయే రుణాలు. సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డు వినియోగాన్ని తగ్గించడం వల్ల నెల నెలా నగదుపరమైన ఖర్చులు కాస్త పెరిగినట్లు అనిపించినా అంతిమంగా మాత్రం ఎంతో కొంత చేతిలో మిగులుతుంది.


 పొదుపు వృథా కావొద్దు: మీ ఆదాయాన్ని అత్యంత తక్కువ వడ్డీనిచ్చే సేవింగ్స్ అకౌంట్లలో వృథాగా మురిగిపోనివ్వొద్దు. ఈ ఖాతాలపై వచ్చే వడ్డీ రేట్లను మించి ధరలు పెరిగిపోతుంటాయి. పెపైచ్చు ఈ రకంగా వచ్చే వడ్డీలపై పన్ను పోటు ఉంటుంది.

 పెట్టుబడుల్లో జాప్యం వద్దు: సాధారణంగా ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనం మెచ్యూర్ అయిన తర్వాత వచ్చిన మొత్తాన్ని మరోదాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మధ్యలో బోలెడంత జాప్యం జరుగుతుంటుంది. దీని వల్ల సదరు మొత్తంపై రావాల్సిన రాబడులను కోల్పోతుంటాం.

 అత్యవసర నిధి ఉండాలి: ఏ ఆర్థిక అవసరం ఎప్పుడు ముంచుకొస్తుందో ఊహించలేము. కనుక మొత్తం డబ్బంతా ఏదో ఒకదాంట్లో ఇన్వెస్ట్ చేసేయడమో లేదా ఖర్చు చేసేయడమో చేయకుండా..  ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా కనీసం 3 నుంచి ఆరు నెలల అవసరాలకు తగిన ంత డబ్బు ఈ ఫండ్‌లో ఉండేలా చూసుకోవాలి.

 బీమా తప్పనిసరి: కుటుంబ పెద్దగా తమకేదైనా అనుకోనిది జరిగితే.. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యతనూ విస్మరించకూడదు. ఇందుకోసం ఎప్పటికప్పుడు తగినంత బీమా కవరేజీ ఉందా లేదా అన్నది సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలి.

 వీలునామా: కూడబెట్టినది ఎంతైనా సరే.. తమపై ఆధారపడి ఉన్న వారు ఎవరైనా ఉంటే వారికోసం కచ్చితంగా వీలునామా రిజిస్టరు చేయించి ఉంచాలి. అలాగే, ఎప్పటికప్పుడు దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉంటే.. వారసులకు తగిన న్యాయం చేసినట్లవుతుంది.

 ప్రతి దానికీ రికార్డు ఉండాలి..
 జమా, ఖర్చులేవైనా సరే ప్రతి దానికీ కచ్చితంగా రికార్డు పాటించాలి. అప్పుడే పన్ను పరమైన డిడక్షన్స్ తీసుకోవడానికి సాధ్యపడుతుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా